దండేపల్లి : అర్హులైనోల్లందరికీ పింఛన్ ఇయ్యుండ్రి బాంచన్.. అంటూ దరఖాస్తుదారులు వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పింఛన్‌రాని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు దండేపల్లిలో భారీ ఎత్తున ఆందోళన చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు.
ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు. ఆందోళన విరమించాలని కోరేందుకు వచ్చిన అధికారుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. పించన్ ఇప్పియ్యాలని వేడుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న ఒకరిద్దరు వృద్ధులు సొమ్మసిల్లిపోయారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించుకున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా మొండికేశారు. దండేపల్లి, లక్సెట్టిపేట ఎస్సైలు మోహన్‌బాబు, ఆకుల అశోక్ వచ్చి తహశీల్దార్ ముబిన్ హైమద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్డీ శివకృష్ణతో కలిసి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఈ నెల 30న అర్హులందరికీ ఫించన్లు వస్తాయని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు.
పింఛన్ ఇయ్యుండ్రి బాంచన్
Published Sat, Nov 15 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement
Advertisement