ఎదురుచూపులే..
► హెచ్‌ఐవీ రోగులకు పింఛన్ల మంజూరులో వివక్ష
►5389 మంది ధరఖాస్తు చేసుకుంటే 3005 మందికి మంజూరు
విజయనగరం ఫోర్ట్ : సాలురు మండలానికి చెందిన ఓ హెచ్‌ఐవీ రోగి ఏడాది కిందట పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అరుుతే అతనికి ఇంతవరకు పింఛన్ మంజూరు కాలేదు. అలాగే చీపురుపల్లి మండలానికి చెందిన ఒకరు ఏడాది కిందట పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోరుుంది. ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది పింఛన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఏఆర్‌టీ కేంద్రంలో 8025 మంది పేర్లు నమోదయ్యారుు. ఇందులో 7746 మంది పెద్దలు కాగా 279 మంది పిల్లలున్నారు.
ఏళ్ల తరబడి..
పింఛన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని చెబుతున్నారని, పాలకులను అడిగితే ఇదుగో.. అదుగో అంటూ కాలయాపన చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. హెచ్‌ఐవీ రోగుల సంక్షేమానికి పాటు పడుతున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్‌కు వీరి బాధలు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అల్లాడుతున్న రోగులు
జిల్లాలో 90 శాతం మంది రోగులు నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. కొంతమందికి కూలీ చేస్తే గాని పూటగడవని పరిస్థితి. హెచ్‌ఐవీ రోగులు పౌష్టికాహారం తీసుకోవాలి. లేనిపక్షంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పింఛన్ సొమ్ము కొంతైనా ఆసరాగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మిగిలిన వారందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
3005 మందికి మాత్రమే..
పింఛన్ల కోసం 5389 మంది దరఖాస్తు చేసుకోగా ఇంతవరకు 3005 మందికి మాత్రమే పింఛన్లు మంజూరయ్యారుు. ఇంకా 2384 మందికి మంజూరు కాకపోవడంతో వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
దశలవారీగా..
దశల వారీగా పింఛన్లు మంజూరవుతారుు. దరఖాస్తు చేసుకున్న రోగులందరికీ పింఛన్లు మంజూరవుతారుు. ఇందులో ఆందోళన చెందాల్సిన పని లేదు. - జి. శంకర్‌రావు,ఏఆర్‌టీ సీనియర్ వైద్యాధికారి