సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) తమ అధిక పెన్షన్ పథకానికి పెట్టిన కఠిన నిబంధనల నుంచి సడలింపు ఇచ్చింది. 2014 సెపె్టంబర్ నాటికే అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకుని, 26(6) నిబంధన ప్రకారం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినవారికే వర్తింపజేస్తామన్న నిబంధనపై వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఉమ్మడి ఆప్షన్, దరఖాస్తులను సమర్పించినా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది.
ఈ మేరకు బుధవారం ఈపీఎఫ్‌ఓ పెన్షన్ విభాగం రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అపరాజిత జగ్గి ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కార్యాలయాల్లోని అదనపు చీఫ్ పీఎఫ్ కమిషనర్లు, ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజనల్ పీఎఫ్ కమిషనర్లకు తగిన సూచనలు చేశారు. అధిక పెన్షన్ కోసం వచ్చి న దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఎలాంటి పత్రాలను పరిగణించి పరిశీలించాలి? ఏయే పత్రాల ఆధారంగా అధిక పెన్షన్ మంజూరు చేయాలి? ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో మినహాయింపు వేటిపై అనే అంశాలపై స్పష్టత ఇచ్చారు.
అధిక వేతనంపై అధిక పెన్షన్..
ఎంప్లాయీస్ పెన్షన్ పథకం (ఈపీఎస్) నిబంధనల ప్రకారం ఉద్యోగుల వేతనంపై పరిమితులున్నాయి. 2014 సెప్టెంబర్‌కు ముందు గరిష్ట వేతన పరిమితి రూ.6,500గా ఉంది. తర్వాత దానిని రూ.15 వేలకు పెంచారు. ఉద్యోగి వేతనం ఎంత ఉన్నా.. ఈ పరిమితి మేరకే పథకాన్ని వర్తింపజేస్తూ, దానికి తగినట్టే పెన్షన్ అందేలా నిబంధన పెట్టారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గరిష్ట వేతన పరిమితి కంటే ఎక్కువ వేతనాలను పొందుతున్న వారికి అధిక పెన్షన్ పొందేందుకు ఈపీఎఫ్‌ఓ ఇటీ వల అవకాశం కల్పించింది.
సదరు అధిక వేతనానికి అనుగుణంగా ఉద్యోగులు, యాజమాన్యం వాటాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ 2014 సెప్టెంబర్ 1 నాటికి అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇచ్చుకుని, 26(6) నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారికే అధిక పెన్షన్‌ను వర్తింపజేస్తామని కొర్రీ పెట్టింది. అయితే లబ్ధిదారుల విజ్ఞప్తుల మేరకు తాజాగా దీనిని సడలించింది.
ఇప్పుడు కొత్తగా ఉమ్మడి ఆప్షన్ ఇస్తూ, 26(6) నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించి ఏమేం పత్రాలు సమర్పించాల్సి ఉంటుందనే దానిపై స్పష్టత ఇచ్చింది. ఆయా పత్రాలకు సంబంధించిన ప్రొఫార్మాలను ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పూరించవచ్చని తెలిపింది.
ఏమేం పత్రాలు కావాలి?
♦ పేరా 6, పేరా 7లకు సంబంధించి ఈపీఎస్ కింద యాజమాన్యం ధ్రువీకరించిన జాయింట్ ఆప్షన్ ఆధారాన్ని సమర్పించాలి.
♦ తర్వాత 26 (6) అనుమతి పత్రాన్ని జత చేయాలి.
♦ యాజమాన్యంతో ఉద్యోగి అండర్‌టేకింగ్ పత్రాన్ని పూరించి.. యాజమాన్యం నుంచి ధ్రువీకరణ చేయించాలి.
♦ ఉద్యోగి తన పేస్లిప్‌ను లేదా యాజమాన్యం జారీ చేసిన అధికారిక వేతన పత్రాన్ని సమర్పించాలి.
♦ యాజమాన్యం ఇస్తున్న వేతన వివరాలతోపాటు దరఖాస్తు, ఉమ్మడి ఆప్షన్, ఇతర పత్రాలను జత చేసి అందజేయాలి.
♦ అధిక వేతనానికి సంబంధించి 2022 నవంబర్ 4కు ముందు పీఎఫ్ కార్యాలయం నుంచి జారీచేసిన పత్రాన్ని జత చేయాలి
♦ అండర్‌టేకింగ్ పత్రాన్ని ఇప్పుడు లేదా క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో అయినా సమర్పించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment