Dandepally
-
హాస్టల్లో విద్యార్థుల బీర్ల విందు! వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు వైరల్
దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బీర్లు, చికెన్‌తో విందు చేసుకున్నారు. బీర్లు తాగుతూ దిగిన సెల్ఫీ ఫొటోలు వైరల్ కావడంతో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బుధవారం విచారణకు ఆదేశించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. బీసీ బాలుర వసతి గృహాంలో ఈ నెల 17న ఆదివారం విద్యార్థులకు చికెన్ వండారు. దీంతో కొందరు విద్యార్థులు రాత్రి భోజనాన్ని గదిలోకి తీసుకెళ్లారు. స్థానిక విద్యార్థుల సాయంతో బీరు బాటిళ్లు తెప్పించుకుని గదిలో వాటిని తాగుతూ సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారులకు వాట్సా ప్తోపాటు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించగా.. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ అధికారి భాగ్యవతి హాస్టల్‌ను సందర్శించి వార్డెన్ మల్లేశ్‌తోపాటు సిబ్బందిని విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. (చదవండి: ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..) ఇళ్ల మధ్యలో ఉండటంతోనే..? వసతిగృహానికి పక్కా భవనం లేకపోవడంతో గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని అందులో నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఉండటంతో స్థానికంగా ఉండే తోటి విద్యార్థులు వీరికి బీరుబాటిళ్లు తెచ్చి ఇవ్వడంతోపాటు సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే చర్చ జరుగుతోంది. కాగా, వాచ్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. వార్డెన్ లక్సెట్టిపేట నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువైంది. ఆ రోజు సాయంత్రం వార్డెన్ త్వరగానే వెళ్లిపోయినట్లు తెలిసింది. (చదవండి: పీసీసీలో ‘పీకే’ ఫీవర్! అలా అయితే ఎలా?) -
మూడుసార్లు పెళ్లి వాయిదా.. సహజీవనం.. ఆ క్రమంలోనే..
సాక్షి, దండేపల్లి (ఆదిలాబాద్): ఏడాది క్రితం నిశ్చియమైన పెళ్లి మూడుసార్లు వాయిదా పడటంతో మనస్తాపం చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్పై పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. కాసిపేట మండలం దేవాపూర్‌కు చెందిన సెడ్మాక సింధు (23)కు ఏడాది క్రితం దండేపల్లి మండలం ఇప్పలగూడకు చెందిన ఆత్రం మహేశ్‌తో పెళ్లి నిశ్చయమైంది. ఇంతలో దగ్గరి బంధువులు ముగ్గురు మృతి చెండంతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చారు. అయితే సింధు, మహేశ్ ఒకరినొకరు ఇష్టపడటం, మేనరికం కావడంతో పెళ్లికాకుండానే ఇప్పలగూడలో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో సింధు గర్భం దాల్చింది. పెళ్లి మూడుసార్లు వాయిదా పడటం, దీంతోపాటు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మొదట లక్సెట్టిపేటకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తండ్రి భగవంత్‌రావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పై తెలిపారు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్) -
ముఖ్యమంత్రికి గుడి కట్టేశాడు...
దండేపల్లి(ఆదిలాబాద్): తమిళుల ప్రభావం అంతో ఇంతో తెలంగాణపై పడినట్లు చెప్పవచ్చు. తమకు నచ్చిన రాజకీయ నాయకుడు, నాయకురాలికి, అమితంగా ఇష్టపడే హీరోయిన్, హీరోలకు గుడి కట్టేయడం తమిళలకు అలవాటే. కానీ, తాజగా అలాంటి ఘటన తెలంగాణలోనూ చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్ ఆయన ఇంటి ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుడి నిర్మించారు. గుడిలో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని నెలకొల్పాడు. నేడు (బుధవారం) సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రవీందర్ దంపతులు ఈ గుడిని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప దేవుడు కేసీఆర్ అని రవీందర్ కొనియాడాడు. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించినప్పటికి వారు రాకపోవడంతో రవీందర్ దంపతులు స్వయంగా గుడిని ఆవిష్కరించుకున్నారు. రవీందర్ గతంలో దండేపల్లిలో తెలంగాణ తల్లి, ప్రొఫేసర్ జయశంకర్ సార్ విగ్రహాలను కూడా నిర్మించి ఉద్యమకారుల్లో స్పూర్తిని రగిలించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కు గుడికట్టి రవీందర్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. -
భార్య గొంతు నులిపి హతమార్చిన భర్త
దండేపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం కొలిమిచెలమ గ్రామానికి చెందిన అంకం శారద(27)ను ఆమె భర్త వెంకటేష్ గొంతునులిమి హతమార్చాడు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. తన కుమార్తెను అల్లుడు వెంకటేష్ గొంతు నులిమి చంపాడని మృతురాలి తండ్రి స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దండేపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌లు ఢీ: ఇద్దరు యువకులు మృతి
దండేపల్లి (ఆదిలాబాద్) : రెండు మోటారుసైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృత్యువాతపడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో గురువారం సాయత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం
దండేపల్లి (ఆదిలాబాద్) : గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులో పని చేసుకుంటున్న రైతులకు మృతదేహం కనిపించడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పోలీసులు స్పందించలేదని ట్యాంకు ఎక్కిన బాధితుడు
ఆదిలాబాద్(దండేపల్లి): ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పదించక పోవడంతో ఓ యువకుడు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు న్యాయం చేయకపోతే కిందకు దూకుతా అని తెలిపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లక్షల్లో సెస్ బకాయిలు
దండేపల్లి : గ్రంథాలయాలకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చెల్లించే సెస్ బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. దీంతో జిల్లాలోని గ్రంథాలయాల్లో అ భివృద్ధి కుంటుపడుతోంది. సెస్ ద్వారానే గ్రంథాలయాలను అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. వసూళ్లు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 52 గ్రంథాలయాలు ఉండగా.. 16గ్రంథాలయాలకు మా త్రమే సొంత భవనాలున్నాయి. 35 గ్రంథాలయాలను పంచాయతీ కార్యాలయాలు, ఉచిత భవనాల్లో నిర్వహిస్తుండగా ఖానాపూర్లోని శాఖ గ్రంథాలయాన్ని అద్దె భ వనంలో కొనసాగిస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ సుమారుగా 5 వేల మంది పాఠకులు గ్రంథాలయాల సేవలను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 వేల మంది గ్రంథాలయ డి పాజిట్దారులు ఉన్నారు. రూ.50 లక్షల వరకు బకాయిలు.. గృహ వినియోగదారులు చెల్లించే ఇంటి పన్నులో నుంచి 8 శాతం పన్ను గ్రంథాలయాలకు చెల్లించాల్సి ఉంటుం ది. జిల్లాలోని 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల ద్వారా జిల్లా గ్రంథాలయ సంస్థకు ఏటా రూ. కోటి వరకు సెస్ వస్తుంది. ఇందులో మున్సిపాలిటీల ద్వారా సుమారుగా రూ.70 లక్షలు, పంచాయతీల ద్వా రా రూ.30 లక్షలు. అయితే సెస్‌లో అధిక బాగం మున్సిపాలిటీల నుంచే రావాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదని గ్రంథాలయ సంస్థ అధికారులు అంటున్నారు. గ్రామ పంచాయతీల్లో కేవలం మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల పంచాయతీలు మాత్రమే సెస్ చెల్లిస్తుండగా మిగతా జీపీల నుంచి అసలు సెస్ రావడం లేదంటున్నారు. మున్సిపాలిటీలు కూడా పూర్తిస్థాయిలో చెల్లించడం లేదు. ఏటా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు మాత్రమే వసూలవుతోంది. కుంటుపడుతున్న అభివృద్ధి.. గ్రంథాలయాల అభివృద్ధికి సెస్ ప్రధానం. గ్రంథాలయాలకు వచ్చే సెస్‌ను పుస్తకాలు, వివిధ దినపత్రికల కొనుగోలుకు, పార్ట్‌టైం వర్కర్లకు వేతనాలు, పుస్తక నిక్షిప్త కేం ద్రాల నిర్వహణకు వినియోగిస్తుంటారు. ఇవే కాకుండా నూతన భవనాల నిర్మాణానికి కూడా వాడుతుంటారు. సెస్ వసూలు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు. -
పింఛన్ ఇయ్యుండ్రి బాంచన్
దండేపల్లి : అర్హులైనోల్లందరికీ పింఛన్ ఇయ్యుండ్రి బాంచన్.. అంటూ దరఖాస్తుదారులు వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పింఛన్‌రాని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు దండేపల్లిలో భారీ ఎత్తున ఆందోళన చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు. ఆందోళన విరమించాలని కోరేందుకు వచ్చిన అధికారుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. పించన్ ఇప్పియ్యాలని వేడుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న ఒకరిద్దరు వృద్ధులు సొమ్మసిల్లిపోయారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించుకున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా మొండికేశారు. దండేపల్లి, లక్సెట్టిపేట ఎస్సైలు మోహన్‌బాబు, ఆకుల అశోక్ వచ్చి తహశీల్దార్ ముబిన్ హైమద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్డీ శివకృష్ణతో కలిసి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఈ నెల 30న అర్హులందరికీ ఫించన్లు వస్తాయని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు.