ముఖ్యమంత్రికి గుడి కట్టేశాడు...
దండేపల్లి(ఆదిలాబాద్): తమిళుల ప్రభావం అంతో ఇంతో తెలంగాణపై పడినట్లు చెప్పవచ్చు. తమకు నచ్చిన రాజకీయ నాయకుడు, నాయకురాలికి, అమితంగా ఇష్టపడే హీరోయిన్, హీరోలకు గుడి కట్టేయడం తమిళలకు అలవాటే. కానీ, తాజగా అలాంటి ఘటన తెలంగాణలోనూ చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్ ఆయన ఇంటి ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుడి నిర్మించారు. గుడిలో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని నెలకొల్పాడు. నేడు (బుధవారం) సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రవీందర్ దంపతులు ఈ గుడిని ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప దేవుడు కేసీఆర్ అని రవీందర్ కొనియాడాడు. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించినప్పటికి వారు రాకపోవడంతో రవీందర్ దంపతులు స్వయంగా గుడిని ఆవిష్కరించుకున్నారు. రవీందర్ గతంలో దండేపల్లిలో తెలంగాణ తల్లి, ప్రొఫేసర్ జయశంకర్ సార్ విగ్రహాలను కూడా నిర్మించి ఉద్యమకారుల్లో స్పూర్తిని రగిలించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కు గుడికట్టి రవీందర్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు.