సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఓ బాలుడి మృతికి దారితీసింది. స్కూల్ బస్సు డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ నడపడంతో... అదుపు తప్పిన బస్సు రోడ్డుపై వెళ్తున్న బాలుడిని ఢీకొంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సూరారం రాజీవ్ గృహకల్పలో ఉండే మోహన్, రేఖలకు రోహన్(6), ధనుష్ (2) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
రేఖ స్థానికంగా ఉన్న మల్లారెడ్డి ఆస్పత్రిలో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తోంది. ప్రతి ఉదయం తన ఇంటి సమీపంలో ఉండే సోదరుడు సంతోష్ ఇంట్లో కుమారులను వదిలి డ్యూటీకి వెళ్తుండేది. ఈ క్రమంలో శనివారం ఉదయం రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబరు 67 వద్ద కిరాణ దుకాణంలో బిస్కెట్లు కొనుక్కుని తిరిగి రోడ్డు దాటుతున్న ధనుష్‌ను ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ధనుష్‌ను ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడ్డ బాలుడిని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయం 9 గంటలకు జరిగిన ఈ ఘటనను సాయంత్రం వరకు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైై వర్ దిలీప్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.