హైదరాబాద్: బహుళజాతి సంస్థల్లో కొలువులు ఇప్పిస్తామని అరచేతిలో వైకుంఠం చూపి... 40 మంది విద్యార్థులను ఓ సాఫ్ట్‌వేర్ శిక్షణా సంస్థ నిండా ముంచేసింది. రూ.20 లక్షల మేర వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేసింది. ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ వరుణ్‌సాయి పంజగుట్ట దుర్గానగర్‌లో ఓ అద్దె ఇంటిలో వరుణ్‌సాయి కన్సల్టెన్సి పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. బిటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్ధులకు సాఫ్ట్‌వేర్ రంగంలో శిక్షణ ఇచ్చి, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికాడు. ఇందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 60వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశాడు. ఇలా 40 మంది నుంచి రూ.20 లక్షలకు పైగా వసూలు చేశాడు.
అయితే, గత 20 రోజులుగా కార్యాలయం తెరవడం లేదు. బాధితులు ఫోన్ చేయగా తనకు కొన్ని సమస్యలున్నాయని, త్వరలోనే కార్యాలయం తెరుస్తానని నమ్మబలికాడు. దీంతో భాదితులు శనివారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.