హైదరాబాద్: తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకొస్తాయని.. ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు ఏడాది నుంచి ఎదురు చూస్తున్నా ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులను రేపు మాపంటూ మభ్య పెడుతున్నారని ఓయూ విద్యార్థులు ఆందోళలనలకు దిగారు. తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా.. ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేస్తారని ఆశించిన నిరుద్యోగులకు చుక్కెదురైంది. దీంతో ఆగ్రహించిన ఓయూ విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం యూనివర్సిటీ నుంచి గన్‌పార్క్ వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ర్యాలీ ఎన్‌సీసీ గేటు వద్దకు చేరుకోగానే పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తర్వాత విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.