
సాక్షి, హైదరాబాద్: రైతులకు సబ్సిడీపై అందజేసే ట్రాక్టర్ల ‘ప్రత్యేక రిజర్వు కోటా (ఎస్‌ఆర్‌క్యూ)’ను రద్దు చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీని పట్టించుకోకుండా హైదరాబాద్ నుంచే నేరుగా ఇచ్చే ఈ పద్దతికి చరమగీతం పాడాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇష్టారాజ్యంగా సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చారన్న విమర్శలు రావడంతో ప్రత్యేక కోటాను రద్దు చేయడమే పరిష్కారంగా భావిస్తున్నారు. మరో వైపు ట్రాక్టర్ల కేటాయింపునకు సరికొత్త మార్గదర్శకాలు తయారు చేయాలని యోచిస్తున్నారు. అర్హుల గుర్తింపునకు వీటిని రూపొందించనున్నారు. ప్రస్తుతం సబ్సిడీ ట్రాక్టర్ కేటాయింపునకు ఇన్నెకరాలు ఉండాలన్న నిబంధన లేదు. ఏభై ఎకరాలున్న ధనిక రైతు కూడా సబ్సిడీ ట్రాక్టర్ పొందే అర్హత ఉంది. దీంతో సన్నచిన్నకారు రైతులకు దక్కాల్సిన సబ్సిడీ పక్కదారి పడుతోందన్న విమర్శలు వచ్చాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా ఎవరైనా పదెకరాల లోపున్న రైతులకే ట్రాక్టర్లు దక్కేలా నిబంధన తేవాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే ఓ నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
కోటా తెచ్చిన తంటా...
వ్యవసాయ యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేస్తుంది. వీటిని గ్రూపు లేదా వ్యక్తిగతంగా ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ట్రాక్టర్ విలువ మార్కెట్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. వీటికోసం రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మండలాల్లో వ్యవసాయాధికారి, ఎండీవో, తహసీల్దార్‌ల బృందం పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. ఆ జాబితాను జిల్లా వ్యవసాయశాఖకు పంపిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఆ జాబితాలను పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తుంది. ఆ పద్దతిని తోసిపుచ్చుతూ వ్యవసాయశాఖ 2016–17 నుంచి ట్రాక్టర్ల కేటాయింపులో ఎస్‌ఆర్‌క్యూ పద్దతిని ప్రవేశపెట్టింది. ఆ శాఖ మంత్రి సిఫారసు చేసిన రైతులకే ట్రాక్టర్లు మంజూరు చేయడం దీని ఉద్దేశం. దీంతో కలెక్టర్ల ఆమోదం లేకుండానే చాలా ట్రాక్టర్లను సిఫారసు లేఖలతోనే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. మంత్రి పేషీ నుంచి సిఫారసు లేఖ వస్తే చాలు వ్యవసాయశాఖ అనుమతి ఇచ్చి జిల్లాలకు పంపించేవారు. దీంతో కొందరు దళారులు సచివాలయంలోనూ, వ్యవసాయశాఖ కమిషనరేట్‌లోనూ తిష్ట వేసి దందా చేశారన్న ఆరోపణలున్నాయి. వారికి రెండుచోట్లా ఒకరిద్దరు అధికారుల సహకారమున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
8 వేల ట్రాక్టర్లు అనర్హులకేనా?
2016–18 మధ్య దాదాపు 15 వేల వరకు ట్రాక్టర్లు సబ్సిడీపై వ్యవసాయశాఖ ఇవ్వగా, వాటిలో దాదాపు 8 వేల ట్రాక్టర్లు ఎస్‌ఆర్‌క్యూ కిందే ఇచ్చినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కొందరు ఫైరవీదారులు వాటిని అమ్ముకొని ఒక్కో ట్రాక్టర్‌పై రూ.లక్ష కమీషన్ తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇలా ఎస్‌ఆర్‌క్యూ కింద భారీ అక్రమాలు జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా. ప్రస్తుత కమిషనర్ రాహుల్ బొజ్జా ట్రాక్టర్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై అంతర్గతంగా విచారణ చేసినట్లు తెలిసింది. పైగా ఆర్థికశాఖ వర్గాలు కూడా ఎస్‌ఆర్‌క్యూ కోటా లోపాలను గుర్తించినట్లు తెలిసింది. దీంతో ఈ కోటా రద్దు చేయడమే మేలని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పైగా అర్హత లేకుండా ఇవ్వడంతో ధనికులే అధికంగా ట్రాక్టర్లు దక్కించుకున్నట్లు తేలిందని ఆయన అభిప్రాయపడ్డారు.