
వ్యవసాయ ట్రాక్టర్ల రాయితీలో కోత!
* 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని యోచన
* రైతుల నుంచి డిమాండ్ పెరగడం వల్లే... ఇప్పటికే పెండింగ్‌లో 10 వేల దరఖాస్తులు
* రాజకీయ నాయకుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు సరఫరా చేస్తోన్న ట్రాక్టర్ల రాయితీని తగ్గించాలని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ట్రాక్టర్లకు ఇస్తున్న 50 శాతం రాయితీని 25 శాతానికి తగ్గించాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సగం ధరకే ట్రాక్టర్లను అందజేస్తుండటంతో రైతుల నుంచి, అధికార పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. నిర్ణీత సంఖ్యకు మించి అనేక రెట్లు డిమాండ్ ఉండటంతో రాయితీని తగ్గించడమే పరిష్కారమని వ్యవసాయశాఖ అంచనాకు వచ్చింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కేవలం అధికార పార్టీ నేతల అనుచరులకే ఈ సబ్సిడీ ట్రాక్టర్లు అందాయన్న విమర్శలున్నాయి. రాయితీని తగ్గిస్తే రాబోయే రోజుల్లో సాధారణ రైతులు నష్టపోయే అవకాశం ఉండనుంది.
కేటాయింపులే తక్కువ
తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల సరఫరాకు రూ. 200 కోట్లు కేటాయించింది. అందులో కేంద్రం వాటా, రాష్ట్రం వాటా ఉన్నాయి. వ్యవసాయ యంత్రాల్లో భూమిని చదును చేయడం నుంచి కోతల వరకు పనికి వచ్చే యంత్రాలున్నాయి. వాటిని 30 నుంచి 50 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ట్రాక్టర్లను 50 శాతం సబ్సిడీపై ఇస్తున్నారు. అందులో ప్రధానంగా వరికి భూమిని సిద్ధం చేయడం, కోతలకు ఉపయోగించడం కోసం 34 హెచ్‌పీ సామర్థ్యం పైగా ఉన్న ట్రాక్టర్లను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఇస్తోంది. ఆ ట్రాక్టర్ల వాస్తవ ధర రూ. 10 లక్షలు ఉండగా... సబ్సిడీపై అది రూ. 5 లక్షలకే లభిస్తోంది. ఎప్పుడూ లేనివిధంగా ఇంత భారీ సబ్సిడీ ప్రకటించడంతో రైతుల్లో పెద్ద ఎత్తున ఉత్సుకత పెరిగింది. మొదట్లో రాష్ట్రవ్యాప్తంగా రూ. 35 కోట్ల సబ్సిడీ ఇచ్చి 740 ట్రాక్టర్లనే జిల్లాలకు కేటాయించారు. అవి సరిపోకపోవడంతో ప్రత్యేక అనుమతి తీసుకొని ఇప్పటివరకు మొత్తంగా 2,500 వరకు ట్రాక్టర్లను అందజేసినట్లు సమాచారం.
వాటిలో చాలావరకు అధికార పార్టీ నేతలు చెప్పిన వారి చేతుల్లోకే వెళ్లాయన్న విమర్శలూ లేకపోలేదు. పెపైచ్చు ఇంకా 10 వేల మందికిపైగా రైతులు ట్రాక్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారని వ్యవసాయమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి తలనొప్పిగా మారిందని తెలిసింది. మరో 10 వేల దరఖాస్తుల ప్రకారం పది వేల ట్రాక్టర్లు మంజూరు చేయడం అసాధ్యమంటున్నారు. ప్రస్తుతం ఇతర వ్యవసాయ యంత్రాలకు ఇస్తున్న సబ్సిడీని ట్రాక్టర్లకు మళ్లించడం నిబంధనల ప్రకారం సాధ్యంకాదని... కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అందుకు ఒప్పుకోవని అంటున్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీని తగ్గిస్తే తప్ప ఈ సమస్యను పరిష్కరించలేమని అంటున్నారు. 25 శాతానికే పరిమితం చేస్తేనే డిమాండ్ తగ్గుతుందని అంటున్నారు.
25 శాతానికి తగ్గించాలనుకుంటున్నాం
ట్రాక్టర్లకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుండటంతో రైతుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కోటాకు మించి అందించాం. అయినా ఇంకా 10 వేలకుపైగా దరఖాస్తులు వ్యవసాయశాఖకు వచ్చాయి. ట్రాక్టర్ల కోటా పెంచడం సాధ్యం కాదు. కాబట్టి సబ్సిడీని 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలనే ఆలోచన చేస్తున్నాం.
- పోచారం శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి