అక్షరాల తోడుగా.. న్యాయం వైపు నడకలు | successful women lawyers in adilabad district to women empowerment | Sakshi
Sakshi News home page

అక్షరాల తోడుగా.. న్యాయం వైపు నడకలు

Published Tue, Feb 20 2018 5:02 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

successful women lawyers in adilabad district to women empowerment - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మహిళా సాధికారత చదువుతోనే సాధ్యం. సమాజంలో పురుషులతోపాటు స్త్రీలకూ సమాన హక్కులుంటాయి. కానీ లింగ వివక్ష నేటికీ కొనసాగడం బాధాకరం. అన్నింట్లో మహిళలకూ సమాన అవకాశాలు ఉంటేనే పురుషాధిక్యత తగ్గుతుంది. స్త్రీలపై జరుగుతున్న వివక్షతకు చరమగీతం పాడాలి. దీని కోసం ప్రభుత్వాలు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

చెన్నూర్‌: అక్షరాస్యతతోనే మహిళ శక్తిగా మారుతుంది. మహిళలు సంపూర్ణ అక్షరాస్యత  సాధించాలి. అన్ని రంగాల్లో లింగ వివక్షత కన్పిస్తోంది. లింగ వివక్షతను రూపు మాపాలంటే చదువు ఒక్కటే మార్గమని చెన్నూర్‌ సివిల్‌ కోర్టు న్యాయవాది చీర్ల గిరిజారాణి అన్నారు. 

‘మాది వేమనపల్లి మండలం జిల్లెడ గ్రామం. మా నాన్న చీర్ల దామోదర్‌రెడ్డి శ్రీరాంపూర్‌ గ్రామంలో వ్యాపారం చేస్తూ స్థిరపడ్డారు. 1వ తరగతి నుంచి 10 వరకు శ్రీరాంపూర్‌లో విద్యాభ్యాసం చేశా. ఇంటర్‌ మంచిర్యాల, డిగ్రీ, న్యాయవాద కోర్సును  హైదరాబాద్‌లో చేశాను. మా సోదరుడు రోషిరెడ్డి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. అన్నయ్యను స్ఫూర్తిగా తీసుకుని న్యాయవాద వృత్తిని ఎంచుకున్నా. న్యాయవాదిగా మహిళలకు న్యాయం చేస్తా. న్యాయవాదిగా పని చేయడం నాకు సంతృప్తిగా ఉంది’  అని గిరిజారాణి అన్నారు.

ఆర్థిక స్వాలంబన సాధించాలి.. 
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మహిళలకు ఆర్థిక స్వాలంబన సాధించాలి. అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగాలి. మహిళలు అనే చులకన భావన అన్ని రంగాల్లో ఉంది. ఈ పరిస్థితుల నుంచి బయటికి వస్తేనే మహిళలకు పురుషాధిక్యత నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. లింగ వివక్షత నుంచి బయట పడాలంటే ప్రతి మహిళ అక్షరం అనే ఆయుధాన్ని సాధించాలి. 

మహిళలకు ప్రత్యేక చట్టాలు..
మహిళలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. భార్యను హింసిస్తే  ఆ భార్య  గృహహింస చట్టం కింద కేసు నమోదు చేస్తే  హింసించిన వారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.  నిరుపేదలకు న్యాయ స్థానాల్లో ఉచిత న్యాయ సేవా, సలహా  కేంద్రాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలి. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.                            
–న్యాయవాది చీర్ల గిరిజారాణి

మహిళలకు అండగా ‘నిర్మల’
నిర్మల్‌అర్బన్‌: నిర్మల్‌ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మునుబర్తి నిర్మల మహిళలకు అండగా నిలు స్తోంది. తను ఎదుర్కొన్న కష్టాలు మరే మహిళ పడకూడదనే ఉద్దేశంతో ‘మహిళా మండలి’ ఏర్పాటు చేసి బాధితులకు న్యా య సహాయం అంది స్తోం ది. మహిళలపై జరుగుతున్న దాడులు,  ప్రేమ పేరుతో జరిగే మోసాలు, లైంగిక వేధింపులు, స్త్రీల హక్కులు, కట్నం కోసం వేధింపులు తదితర రుగ్మతలపై పోరాడుతోంది. యువతులకు మహిళ చట్టాలపై అవగాహన కల్పిస్తుంది.

న్యాయవాదిగా ఎదిగి.. 
నిర్మలది ప్రేమ వివాహం. వివాహానంతరం తన కుటుంబసభ్యుల నుంచి సహకారం అందలేదు. సన్నిహితులందరి నుంచి ఆదరణ కరువైంది. అప్పటికి నిర్మల ఏడో తరగతి మాత్రమే చదువుకుంది. ఆమెకు చదువు విలువ తెలిసివచ్చి నిర్మల్‌లోని డిగ్రీ కళాశాలలో ఓపెన్‌ యూనివర్సిటీ ద్వార డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఎల్‌ఎల్‌బీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. 2011లో బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం తీసుకున్నారు. ఎన్నో శ్రమలను ఎదుర్కొని స్వయం శక్తితో న్యాయవాదిగా ఎదిగారు. 

మహిళా మండలి ఏర్పాటు..
బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం పొందిన తర్వాత 2012లో ఐద్వా ఆదిలాబాద్‌ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మహిళలు, యువతులకు న్యాయ సహాయం అందించేందుకు మహిళా మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలి ద్వారా కళాశాలల్లో యువతులకు ప్రేమ పేరిట జరుగుతున్న మోసాలపై, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్న వారి మధ్య మనస్పర్దలు వస్తే వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.  
-నిర్మల, న్యాయవాది

న్యాయవాది వృత్తి ఉన్నతమైనది
లక్సెట్టిపేట(మంచిర్యాల): మండలంలోని ఊత్కూరు గ్రామ పంచాయతీ పరిధి గంపలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ళ పద్మ న్యాయవాది వృత్తిలో రాణిస్తుంది. ముం బాయిలో డిగ్రీ వరకు చదువుకుని వివా హం కావడంతో  గ్రామానికి విచ్చేసి చదువుపై ఉన్న శ్రధ్ధతో న్యాయవాద వృత్తిపై ఉన్న మమకారంతో కష్టపడి హన్మకొండలోని లా కళాశాల నుంచి న్యాయవాద పట్టా సంపాదించారు. 2012వ సంత్సరం నుంచి  మండల కేంద్రంలోని మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రస్తుత రోజుల్లో కష్టపడితే సాధించలేనిది ఏది లేదంటున్నా రు. సమాజంలో మహిళలు ఇంకా ముందుకు రావాలని సూచించారు. భర్త ప్రైవేటు వాహన డ్రైవర్‌గా చేస్తుంటారు. ఇద్దరు పిల్లలను చదివిస్తూ కుటుం బానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. న్యాయవాద వృత్తి వలన అన్ని చట్టాలు తెలసి ఉంటాయని ప్రతి విషయంపై అవగాహన వస్తుందన్నారు. న్యాయవాద వృత్తి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
-న్యాయవాది పద్మ 

మహిళలు విభిన్న రంగాల్లో రాణించాలి
ఖానాపూర్‌:  స్త్రీలు విభిన్న రంగాల్లో రాణించినప్పుడే వారికంటూ ఒక ప్రత్యేకతతో పాటు గుర్తింపు ఉంటుందనేది నా నమ్మకం అని న్యాయవాది తునికి అరుణ అన్నారు. సోమవారం నేను శక్తిలో భాగంగా సాక్షితో మాట్లాడారు. తాను న్యాయవాది వృత్తిలో రాణించడానికి నా కుటుంబ ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. స్త్రీ సమానత్వం కుటుంబ స్థాయి నుంచే ఉండాలని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలను ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివించి వారి లక్ష్యం మేరకు ప్రోత్సహించినప్పుడే మహిళలు వివిధ రంగాల్లో రాణించడానికి ఆస్కారం ఉందన్నారు.

ప్రతి మహిళలో సామాజిక చైతన్యంతోపాటు చట్టాలపై సరైన అవగాహన ఉన్నప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సగర్వంగా జీవిస్తారన్నారు.  మహిళాభ్యున్నతి సాధించాలంటే కేవలం సాధికారిత సాధిస్తే సరిపోదని, దాని ఫలాలు అందరికీ అందేలా చూసినప్పుడే అది సాధ్యం అవుతుందన్నారు. నేడు మహిళా సాధికారిత పేరుతో ఎన్నో చట్టాలు, సభలు, సంఘాలు ఏర్పడుతున్నాయని చెప్పారు.   మహిళలపై జరిగే అన్యాయాలను ప్రతిఘటించాలి.
-న్యాయవాది తునికి అరుణ

సంకల్పమే సగం బలం
ఆదిలాబాద్‌: సంకల్పమే సగం బలం అంటారు. అనుకున్నది సాధించాలనే తపన ఆమెను ముందుకు నడిపించింది. కుటుంబ పోషణ బాధ్యతను మోస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు రావాలనుకుంది. అది చదువుతోనే సాధ్యమవుతుందని చిన్నప్పటి నుంచి న్యాయవాది కావాలన్న కోరికను నెరవేర్చుకుంది ఆదిలా బాద్‌కు చెందిన అడ్డి మంజులతరెడ్డి. తలమడుగు మండలం బరంపూర్‌ గ్రామానికి చెందిన రాఘవేందర్‌రెడ్డి, సుచితల కూతురే మంజులతరెడ్డి. 

న్యాయవాది కావాలని..
మంజులతరెడ్డిది వ్యవసాయ కుటుంబం. అయినా తండ్రి కూతురు చదువును పోత్రహించాడు. చిన్నప్పటి నుంచే తాను న్యాయవాదిని కావాలనే కోరిక బలంగా ఉండేది. శిశు నుంచి పదో తరగతి వరకు ఆదిలాబాద్‌లోని శిశుమందిర్‌ పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్, డిగ్రీ జిల్లా కేంద్రంలోని బాలికల ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి చేసింది. 1996లో డిగ్రీ పూర్తి అయిన తర్వాత మూడు సంవత్సరాలు ప్రైవేట్‌ ఉద్యోగం చేశారు. 2000 సంవత్సరంలో పెళ్‌లైంది.

పెళ్లి తర్వాత కూడా తన చదువు వృథా పోకూడదని, ఏదైతే చిన్నప్పటి నుంచి న్యాయవాది కావాలనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని అనుకుంది. తాను చదువుకున్న చదువుకూ.. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలనుకుని ఎల్‌ఎల్‌బీ చేయాలని నిర్ణయించుకుంది. భర్త చంద్రశేఖర్‌రెడ్డి ఇందుకు ప్రోత్సహించడంతో చంద్రాపూర్‌లోని నాగ్‌పూర్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీలో ప్రవేశం పొందారు.  అయితే స్వతహాగా ఆమె తెలుగు మీడియం కావడంతో ఇంగ్లిష్‌ పరీక్ష రాయడం ఇబ్బందిగా మారింది. దీంతో లీగల్‌ డిక్షనరీ తనకు ఎంతో ఉపయోగపడింది. పరీక్షల సమయంలో 30 సబ్జెక్టులను టెస్టు పేపర్‌ ద్వారానే పరీక్షలకు సిద్ధమైంది. ఇంట్లో పిల్లలు, కుటుంబ సభ్యుల పోషణ బాధ్యతలు చూసుకుంటూనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. 2006లో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు కోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. ఆ తర్వాత 2009లో ఉమెన్‌ వెల్ఫేర్‌ గృహహింస చట్టంలో లీగల్‌ కౌన్సిలర్‌గా నియామకమయ్యారు. ఎంతో మందికి కౌన్సెలింగ్‌ ఇస్తూ దంపతుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది మంజులతరెడ్డి. 

మహిళలు రాణించగలరని..
ప్రస్తుత తరుణంలో ప్రతి మహిళ వైద్యురాలిగా లేదంటే ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని కోరుకుంటారు. కానీ మంజులతరెడ్డి అందుకు భిన్నంగా న్యాయవాది వృత్తిని ఎంచుకున్నారు.  అయితే కొంత మంది న్యాయవాదులు మహిళలు న్యాయవాది వృత్తిలో రాణించలేరని.. ఇందులో ఆదాయం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ అభిప్రాయాలను ఆమె లెక్కచేయలేదు. కొంత మంది సీనియర్‌ న్యాయవాదులు ఆమెను ప్రోత్సహించడంతో ఆమె ఇందులో నిలదొక్కుకున్నారు. తన భర్త, కుటుంబ సభ్యులు తనకు ఎంతో అండగా ఉండడంతోనే తాను ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగానని మంజులతరెడ్డి చెబుతోంది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారనే ఆమె నిరూపించింది. 
-మంజులత రెడ్డి

ఇష్టపడే న్యాయవాద వృత్తిలోకి..
కాగజ్‌నగర్‌టౌన్‌: ఇష్టపడి చదివి న్యాయవాది వృత్తిని ఎంచుకున్నాను. నేను 1వ తరగతి నుంచి బీఎస్సీ వరకు కాగజ్‌నగర్‌ పట్టణంలోనే చదివినాను. ఎల్‌ఎల్‌బీ వరంగల్‌లో పూర్తి చేసి 2012 నుంచి న్యాయవాది వృత్తి చేస్తున్నాను. తండ్రి ఫజల్‌ ఆహ్మద్, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే న్యాయవాది వృత్తిలో రాణిస్తున్నాను. జనవరి 26న ఉత్తమ న్యాయవాదిగా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ చేతుల మీదుగా ప్రశంస పత్రం తీసుకున్నాను.

మహిళ రిప్రజంటేటివ్‌ సిర్పూర్‌(టి) కోర్టు, మానవహక్కుల కమిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్, మైనార్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యురాలుగా ఉన్నాను. పేద మహిళ సమస్యలపై స్పందించి పేదల కోసం ఉచితంగా వాదిస్తున్నాను. లోక్‌ ఆదాలత్‌లో మహిళలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాను. పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు ఉన్నాయి. చట్టాలు తెలియన అమాయక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. 
-రాహత్‌ ఫాతిమా, న్యాయవాది, సిర్పూర్‌(టి) కోర్టు

చదువే అన్నింటికీ మూలం
ఆమె చిన్నతనంలోనే తండ్రి అకాల మరణం చెందాడు. నలుగురు పిల్లల సంతానం ఉన్న ఆ కుటుంబంలో ఆమె మూడో వ్యక్తి. డిగ్రీ వరకు చదువుకున్నాక అనూహ్యంగా  ప్రేమ పెళ్లి చేసుకున్నారు.అప్పటికే చదువు ఆగిపోయినట్లేనని భావించిన ఆమెకు భర్త , బంధువులు, కుటుంబ సభ్యుల సహకారం లభించడంతో పట్టుదలతో చదివి న్యాయవిద్యను అభ్యసించారు. ప్రస్తుతం బెల్లంపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న ఆ మహిళనే నల్లుల సంగీత. తన కుటుంబ నేపథ్యం, ఎంచుకున్న లక్ష్యం గురించి‘ సాక్షి’తో  ఆమె ముచ్చటించారు. 

బెల్లంపల్లి: మాది బెల్లంపల్లి మున్సిపాలిటీలోని రైల్వే రడగంబాల బస్తీ.మాది అత్యంత మధ్యతరగతి కుటుంబం.మా తల్లిదండ్రులు నల్లుల మాధవి, కృష్ణకు నలుగురం సంతానం. నేను మూడో వ్యక్తిని. నాకు అక్క, అన్న, తమ్ముడు.మా నాన్న అకాల మరణం చెందడంతో మా కుటుంబ పరిస్థితి కష్టాల్లో పడింది. కష్టాలు పడుతూనే మా అమ్మ అన్నీ తానై మాకు చదువు చెప్పిం చింది.నేను డిగ్రీ వరకు చదువుకున్నాక లోకం పోకడ కొంత అవగతమైంది.అంతలోనే ప్రేమ పెళ్లి చేసుకున్నాను. చదువుకోవాలనే ఆసక్తి కూడా తగ్గింది.

కానీ నా భర్త ఉపేందర్, అత్తా మామ మా బంధువులు, సన్నిహితులు, మా కుటుంబ సభ్యులు  ప్రోత్సహించి నాతో  ఎల్‌ఎల్‌బీ చది వించారు.హైదరాబాద్‌లోని ఆదర్శ లా కళాశాలలో చదివి 2015లో ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నాను.  రెండేళ్ల నుంచి న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్నాను. న్యాయ శాస్త్రం చదవడం వల్ల అ న్నింటా వివక్షతకు గురవుతున్న మహిళలకు న్యా య సలహాలు అందించడానికి, న్యాయం చేయడానికి వీలు కలిగింది.

చదువుకోవడం వల్లే..
అన్నింటికీ మూలం చదువు. విద్య నేర్వడం వల్ల సమాజంలో జరుగుతున్న పరిణామాలను, మం చి చెడు విచక్షణ అవగతమవుతుంది. అన్నింటికి మించి ధైర్యం వ స్తుంది. చదువుతోనే  సమాజంలో గౌరవం దక్కుతుంది. నేను ఉ న్నత విద్యను అభ్యసించి న్యాయవాద వృత్తిని చేపట్టడం వల్ల న్యాయమూర్తి ముందు కుర్చీలో కూర్చునే గౌరవం దక్కింది. ఇది నాకెంతో ఆనందంగా ఉంది. మా కుటుంబ సభ్యులు అమ్మాయికి చదువెందుకని భావిస్తే ప్రస్తుతం నేనీ స్థితిలో ఉండే అవకాశం ఉండేది కాదు. 

చదువుతోనే ధైర్యం..
విద్యను అభ్యసించడం వల్ల మహిళలకు ఎంతో ధైర్యం వస్తుంది. ఎన్నో విషయాలపై అవగాహన కలుగుతుంది.బాలికలు ఏదైనా సమస్య ఎదురైతే మానసికంగా కుంగి పోకూడదు. ప్రతి సమస్యకు  పరిష్కారం ఉంటుందని గ్రహించాలి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. 
-సంగీత (న్యాయవాది)

ఆడపిల్లలను అర్థం చేసుకోవాలి
మంచిర్యాలటౌన్‌: తల్లిదండ్రులు ఆడ పిల్లలను ఎంతో ప్రేమతో పెంచినా, పెళ్లి విషయం వచ్చేసరికి మాత్రం వారి పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా, డబ్బు, హోదా, ఉద్యోగాలను చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నారని మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మహిళా న్యాయవాది కండెవీర చిదానంద కుమారి అన్నారు. న్యాయవాదిగా పనిచేస్తూ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా ఆమె పనిచేస్తుండగా, అమ్మాయిలు, మహిళల పట్ల జరుగుతున్న వివక్షను అమె ‘సాక్షి’తో పంచుకున్నారు. పెళ్లి అయ్యాక అమ్మాయిలు వారి ఇష్టాలకు దూరంగా బతుకును వెళ్లదీసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

నేను పుట్టి పెరిగింది వరంగల్‌లో. మా అమ్మానాన్న పీఎల్‌ నర్సింగరావు ఎల్‌ఐసీలో జాబ్‌చేస్తూ మా ముగ్గురు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించారు. ఎంఏ పూర్తి చేసిన నాకు మంచిర్యాలకు చెందిన కేవీ ప్రతాప్‌తో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత తనకు చదువుకోవాలని ఉందని చెప్పిన వెంటనే నా భర్త నన్ను ఎల్‌ఎల్‌బీ చేసేందుకు ప్రోత్సాహం ఇచ్చారు. ఎడ్యుకేషన్‌పై పీహెచ్‌డీ కూడా చేసి, 1990 నుంచి మంచిర్యాలలోనే లాయర్‌గా పనిచేస్తున్నాను. ఆ తర్వాత కోర్టుకు వచ్చే ఫ్యామిలీ కేసులను తనకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు వందకు పైగా వివిధ సమస్యలతో వచ్చే వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వగా, అందులో సగానికి పైగానే పలువురు మారి సంసార జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.

కూచిపూడి నృత్యంలో ఆల్‌ ఇండియా కూచిపూడి పోటీల్లో 1982లో మొదటి బహుమతిన పొందాను. పెళ్లి తరువాత తనకు వచ్చిన కూచిపూడిని నలుగురికి అందించాలని ఉచితంగా నేర్పిస్తూనే ఉన్నాను. మంచిర్యాల మహిళా తరంగిణి(మమత) అనే మహిళా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి మహిళలకు ఉన్న చట్టాలు, సమాజంలో మహిళలు సమస్యలను ఎదుర్కొనే విధానాన్ని వివరిస్తున్నాను. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ, మహిళల్లో చైతన్యం తీసుకువస్తున్నాను. తన దగ్గరకు వచ్చే వారికి ఉచితంగా న్యాయసలహాలు, కౌన్సెలింగ్‌ ఇస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయిని బీటెక్‌ ఎంబీఏ చదివించి పెళ్లి చేశాను. అబ్బాయి ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తున్నాడు.

అన్నీ కుటుంబసమస్యలే
ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు వచ్చే వారిలో ఎక్కువగా భార్యాభర్తలకు సంబంధించిన సమస్యలే వస్తున్నాయి. అందులో భార్యను అదనపు కట్నం కోసం వేధించడం, ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుని భార్యను హింసిస్తున్న వారి సంఖ్యనే అధికంగా ఉంటుంది. పురుషులు, మహిళలు సమానం అనే భావన ఇప్పటికీ నేను చూసిన కేసుల్లో ఎక్కడా కనబడడం లేదు. పురుషులు అహంతో కూడిన వారే ఎక్కువగా చూశాను. కౌన్సెలింగ్‌కు రెండేళ్ల సమయం తీసుకున్నా, వారిలో మార్పు రాకపోవడం, మహిళల్లో మార్పు వచ్చినా సంసారంలో మళ్లీ పురుషుల ఆధిక్యత పెరిగి విడిపోతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ముందుగా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. మంచి ఉద్యోగం ఉందని పెళ్లి చేస్తే, తమ అమ్మాయి వేధింపులకు బలవుతుందన్న ఆందోళన వారి తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. పెళ్లి చేయడం ఎంత ముఖ్యమో, అమ్మాయికి తగిన వారిని చూసి చేయడం అంతే ముఖ్యం. ఆడపిల్లల మనసును అర్థం చేసుకుని వారి ఇష్టాల్ని తెలుసుకుని ప్రవర్తించాలి. మగవారితో సమానంగా ఆడవారికి కూడా హక్కులున్నాయనే విషయాన్ని గుర్తించాలి.
-చిదానంద కుమారి

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

కూచిపూడి నృత్యం చేస్తూ, తన శిష్యులతో చిదానంద కుమారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement