
1 నుంచి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు
- పథకాన్ని ప్రకటించిన యాజమాన్యం
- జనవరి 1 నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు మోక్షం కలిగింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు చేసింది. 2017 జనవరి 1 నుంచి వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 48–58 ఏళ్ల మధ్య వయసున్న సింగరేణి కార్మికులు అనారోగ్య కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వారి వారసులకు ఉద్యోగం ఇప్పించేందుకు అర్హులు.
అయితే దరఖాస్తు సమయానికి కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలి. ఈ రెండేళ్ల కనీస సర్వీసు విషయంలోనూ ‘వన్ టైం’ మినహాయింపును వర్తింపజేశారు. దీనిద్వారా 2016 అక్టోబర్ 11 నాటికి ఏడాదికి మించి సర్వీసు ఉన్న ఉద్యోగులు(అంటే 2017 అక్టోబర్ 31వ తేదీ లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసేవారు) సైతం వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే 2017 జనవరి 1 నుంచి 2017 మార్చి 31లోగా దరఖాస్తు చేసుకుంటేనే వీరు అర్హులు కానున్నారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతో 30 వేల మందికి పైగా యువకులను సంస్థల్లో చేర్చుకునేందుకు అవకాశం కలిగిందని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్(ఎన్‌సీడబ్ల్యూఏ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు.. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ కొత్త పథకాన్ని సింగరేణి ప్రకటించింది.
ఈ అర్హతలు కలిగి ఉండాలి..
- 48–58 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలి. అనారోగ్య కారణాలతో సర్వీసులో కొనసాగలేరని కంపెనీ మెడికల్ బోర్డు ధ్రువీకరించాలి.
- దరఖాస్తు నాటికి రెండేళ్లకు మించి సర్వీసు ఉన్న ఉద్యోగులు 58 ఏళ్ల వయసు వచ్చాకే పదవీ విరమణ చేసేందుకు అవకాశం ఉంటుంది.
- అనారోగ్య కారణాలతో యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగిస్తే మాత్రం అంతకు ముందే పదవీ విరమణకు అవకాశం కలగనుంది.
- భార్యాభర్తలిద్దరూ కంపెనీ ఉద్యోగులైతే.. ఒకరే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
వారసులకు ఉండాల్సిన అర్హతలివీ..
ఉద్యోగిపై పూర్తిగా ఆధారపడి, అతడితో కలిసి నివాసం ఉండే కుమారుడు/అల్లుడు/తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందడానికి అర్హులు. ఉద్యోగి కోరిక మేరకు సంస్థ వీరిలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పిం చనుంది. రెండో భార్యకు పుట్టిన కొడుకు, చట్టబద్ధంగా కాని పెళ్లి ద్వారా పుట్టిన సంతానం, దత్తత కొడుకులు ఈ పథకం కింద ఉద్యోగాలు పొందడానికి అనర్హులు.
ఇది సాహసోపేత నిర్ణయం: సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్
‘‘ఈ నిర్ణయంతో సీనియర్ కార్మికులు, వారి పిల్లలకే కాక కంపెనీ, రాష్ట్రానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వారసత్వ ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధిం చి కార్మికులకు పూర్తి సమాచారం, సలహా లు, సూచనలు అందించడానికి సింగరేణి వ్యాప్తంగా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. అన్ని గనులు, ఏరియా ఏజీఎం కార్యాల యాలు, ఏజెంటు కార్యాల యాల్లో వీటిని ఏర్పాటు చేస్తాం. జనవరి 1 నుంచి సంబంధిత గని/శాఖలో కార్మికుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాం. దాదాపు 2 దశాబ్దాలుగా కొత్త నియామకాలు జరగకపోవడంతో ప్రస్తుతం సింగరేణి కార్మికుల సగటు వయసు 53 ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం సంస్థలో 58 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా.. అందులో 30 వేల మంది స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తమ వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం లభించనుంది’’