
వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే: కోదండరాం
శ్రీరాంపూర్(మంచిర్యాల): సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలకు గతంలో ఇచ్చిన సర్క్యులర్‌లో హైకోర్టు చేసిన సూచనల మేరకు మార్పులు చేసి డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో నిర్వహించిన సింగరేణి బిడ్డల సంఘం సదస్సులో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఆర్టికల్ 14, 16 ప్రకారం కొన్ని అభ్యంతరాలను లేవనెత్తిందని, దానికి అనుగుణంగా సవరణలు చేసి ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. అలా చేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఊహించలేమన్నారు.
సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని, దాని ప్రకారం ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ప్రభుత్వం అన్ని సంఘాలను పిలిచి చర్చించి అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేదన్నారు. బొగ్గుబాయి, దుబాయి బతుకులు ఒకటే అని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. వారసత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కార్మికులు వారి పిల్లలకు అప్పులు చేసి పెళ్లిళ్లు చేశారని, చాలా కుటుంబాలు నేడు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.
తెలంగాణలో ఇంకా ఆంధ్ర పాలకుల వారసత్వమే కొనసాగుతోందని ప్రజా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గాదె ఇన్నారెడ్డి విమర్శించారు. ఈ నెల 17 నుంచి తలపెట్టిన సింగరేణి సమ్మెను విజయవంతం చేసి 27న వరంగల్‌లో జరిగే టీఆర్‌ఎస్ బహిరంగ సభకు కేసీఆర్‌ను అడుగుపెట్టనీయవద్దని పిలుపునిచ్చారు. ఓసీపీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్‌రావు మాట్లాడుతూ కోదండరామ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ.మునీర్, ప్రజా తెలంగాణ నాయకులు శ్రీశైల్‌రెడ్డి, జేఏసీ జిల్లా చైర్మన్ బాబన్న, కన్వీనర్ పీ సంజీవ్, సింగరేణి బిడ్డల సంఘం నాయకులు కొమ్ము శ్రీనివాస్, ఎర్రొళ్ల నరేశ్, అంబాల రాజ్‌కుమార్, నాయకులు నీరటి రాజన్న, శంకర్, రమణాచారి, అభిషేక్, తిరుపతి పాల్గొన్నారు.