
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో కార్మికులకు, వారి కుటుంబాలకు పలు ప్రయోజనాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ కొద్ది రోజులుగా ప్రచారం నిర్వహిస్తోన్న జేఏసీ చైర్మన్ కోదండరాంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఓట్ల కోసం మాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కోదండరాం.. ఎవరాయన? తాడు, బొంగరం లేనివాళ్లు ఏదేదో మాట్లాడుతారు. మేం చెప్పింది చేస్తాం. ఉద్యోగాల కోసం కొత్త భూగర్భగనులు ప్రారంభిస్తాం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 1980 నుంచి సింగరేణిలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఇంతకాలం గెలిచినవాళ్లు పనులు చేయలేదని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే వేల మందికి ఉద్యోగాలిచ్చామని సీఎం గుర్తుచేశారు.
నల్లగొండ ఉప ఎన్నిక: కొద్దికాలంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన నల్లగొండ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘అసలు నల్లగొండ ఉప ఎన్నిక వస్తుందో, రాదో నాకు తెలియదు. ఒకవేళ వస్తే, అప్రతిహాసంగా టీఆర్‌ఎస్ పార్టీనే గెలుస్తుంది’’ అని అన్నారు.