కొండపాక, న్యూస్‌లైన్ : రికార్డులు, స్టాకుల్లో తేడా ఉండడంతో మండలంలోని దుద్దెడ శివారులో గల సురభి రైస్ మిల్లును శుక్రవారం జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ) బీ ఏసురత్నం సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ విలేకరులతో మాట్లాడారు. మిల్లు రిజిస్టర్‌లో నమోదైన 25 వందల వడ్లను నిబంధనలకు విరుద్ధంగా గురువారం ఒక రోజే మిల్లు నిర్వాహకులు అమ్ముకున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. లెక్క ప్రకారం ఇందులో 70 శాతం లేవీ బియ్యం ఇవ్వాల్సి ఉందన్నారు. 2013 - 14 సంవత్సరం ఖరీఫ్‌లో 12 వేల క్వింటాళ్ల బియ్యం లేవీ ప్రభుత్వానికి ఇవ్వాలన్న టార్గెట్ ఉండగా ఇందులో కేవలం 1,090 క్వింటాళ్ల మాత్రమే ఇచ్చారన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 2,643 కింటాళ్ల ధాన్యాన్ని మిల్లు ఆడించి 1,770 క్వింటాళ్ల బియ్యం పౌరసరఫరాల విభాగానికి అప్పగించాల్సి ఉంది.
అయితే అందులో 810 కింటాళ్లు మాత్రమే ఇచ్చారని, మిగతా 960 క్వింటాళ్ల బియ్యం బకాయి ఉన్నారని డీఎస్‌ఓ ఏసురత్నం వివరించారు. మిల్లు ఆడించడానికి తాము అప్పగించిన ధాన్యం స్టాక్‌కు, రికార్డులకు పొంతన లేదన్నారు. రికార్డుల ప్రకారం మిల్లులో 610 క్వింటాళ్ల బియ్యం నిలువ ఉండాలని, సుమారు 500 క్వింటాళ్లు మాత్రమే లెక్క తేలిందన్నారు. నిర్వాహకులు రికార్డులు సరిగా నిర్వహించడం లేదన్నారు. రికార్డులను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నామని, మిల్లును కూడా సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట,సంగారెడ్డి డివిజన్ల ఏఎస్‌ఓలు తాటి వెంకటేశం, మోహన్‌బాబు, ఆర్‌ఐ నీలిమ, వీఆర్‌ఓ శ్రీధర్‌లున్నారు.
పౌరసరఫరాల అధికారుల ఆకస్మిక దాడులు
Published Fri, Mar 14 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement
Advertisement