ఎంజీఎంలో స్పీకర్ ఆకస్మిక పర్యటన
- రోగులకు పరామర్శ
- ఆస్పత్రికి ప్రత్యేక విద్యుత్ లైను ఏర్పాటుచేయాలని ఎస్‌ఈకి ఆదేశం
- స్పీకర్ సందర్శనతో అప్రమత్తమైన అధికారులు
ఎంజీఎం : ప్రమాదంలో గాయపడి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన కళావతిని శనివారం స్పీకర్ మధుసూదనాచారి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న వైద్యులను ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐసీసీయూ విభాగంలో గుండె నొప్పితో చికిత్సపొందుతున్న అదే గ్రామానికి చెందిన బోజ ఉదయమ్మను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రిలో ఆయన సుమారు 40 నిమిషాలకుపైగా ఉండగా విద్యుత్ సరఫరా లేని విషయాన్ని గమనించి అధికారులను వివరణ అడిగారు.
దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ సమాధానమిస్తూ ఎంజీఎం ఆస్పత్రికి ప్రత్యేకమైన విద్యుత్ లైన్ లేదని, దీంతో విద్యుత్ సరఫరా లేని సమయంలో అత్యవసర వార్డులకు జనరేటర్ ద్వారా విద్యుత్ అందిస్తామని తెలిపారు. మిగతా వార్డులకు సరఫరా చేసే జనరేటర్ లేదని పేర్కొన్నారు. దీంతో స్పందించిన స్పీకర్ నాలుగు జిల్లాల పేదప్రజలకు పెద్దాస్పత్రిగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రికి వెంటనే ప్రత్యేక విద్యుత్‌లైన్ ఏర్పాటు చేయాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈని ఫోన్‌లో ఆదేశించారు. ఎలాంటి ఆవాంతరాలు ఎదురైనా వీలైనంత త్వరగా ఆస్పత్రికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ఎస్‌ఈకి తెలిపారు.
పరుగెత్తుకొచ్చిన ఎంజీఎం పరిపాలనాధికారులు
స్పీకర్ మధుసూదనాచారి అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా ఆకస్మికంగా ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. రెండో శనివారం కావడంతో ఎంజీఎంలో పరిపాలనాధికారులు ఎవరూ అందుబాటులో లేరు. స్పీకర్ వచ్చారనే విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి పరుగులు తీశారు. స్పీకర్ వచ్చిన 20 నిమిషాలకు ఆర్‌ఎంఓ నాగేశ్వర్‌రావు చేరుకోగా.. ఆ తర్వాత సూపరింటెండెంట్ మనోహర్, ఆర్‌ఎంఓలు హేమంత్, శివకుమార్ తరలివచ్చారు.