సాక్షి, హైదరాబాద్ : ఆదిత్యా హోమ్స్ డైరెక్టర్, చైర్మన్ మధ్య నెలకొన్న వివాదం తారా స్థాయికి చేరింది. ఇంటి సమస్య కాస్తా తీవ్ర విభేదాలతో రచ్చకెక్కింది. 100 కోట్ల రూపాయలు విలువచేసే డాక్యుమెంట్ల చోరీతో మొదలైన వివాదం మరింత ముదిరింది. తన బావ కోటారెడ్డి తనను జైలుకు పంపేందుకు కుట్రలు పన్నుతున్నారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. వ్యాపారం పేరుతో తన కుటుంబాన్ని నిలువునా మోసం చేశారని, కంపెనీ లాభాలు తీసుకుని తమను దోచుకున్నారని వాపోయారు. కొడుకుతో తనకు ప్రాణహాని ఉందని సుధీర్‌రెడ్డి తల్లి అజంతా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. (ఆ చోరీ చేసింది నా కొడుకే.. ప్రాణాహాని ఉంది)
‘15 ఏళ్లుగా కోటారెడ్డి కుటుంబంతో మాకు మాటల్లేవు. 1995లో నేను అమెరికా వెళ్లాను. నేను, నా భార్య కలిసి డబ్బు సంపాదించి తిరిగి ఇండియా వచ్చాం. మా నాన్న చనిపోతూ కుటుంబమంతా కలిసి ఉండాలని కోరుకున్నారు. 2016లో నేను ఆదిత్యా హోమ్స్‌లో డైరెక్టర్‌గా చేరాను. అప్పటి నుంచి అమ్మ, అక్క.. నన్ను వేధించడం మొదలుపెట్టారు. ఇంటిని మా అమ్మకు ఇచ్చేందుకు అక్కా,బావ ప్లాన్ వేశారు. 2014లో వంశీరామ్ బిల్డర్స్‌తో కలిసి.. గండిపేట్‌లో మా బావ కోటారెడ్డి విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించారు. అందులో 25 విల్లాలకు నా ద్వారానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసే అధికారం ఎవరిచ్చారంటూ.. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి నన్ను ప్రశ్నించారు. సుబ్బారెడ్డికి తెలియకుండా విల్లాల రిజిస్ట్రేషన్లు చేసే అధికారం మా బావ కోటారెడ్డే నాకు ఇచ్చారు. ఈ విషయంలో కోటారెడ్డి నన్ను మోసం చేశారు. సుబ్బారెడ్డి అనుమతి లేకుండా నేను సేల్ డీల్స్ చేయడం తెలీకుండా చేసిన తప్పు. (100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు అపహరణ)
ఆదిత్యా హోమ్స్‌పై కేసులు పెడతానని ఆనాడే సుబ్బారెడ్డి హెచ్చరించారు. వాళ్లు చేసిన తప్పులను నాపై నెట్టేశారు. నేను సుబ్బారెడ్డితో కుమ్మక్కయ్యాననేది మా బావ అపోహ.. నా ఇంటిని కాజేయాలని, నన్ను ఇంటి నుంచి గెంటేసే కుట్ర చేశారు. పోలీసుల పేరుతో నా ఇంట్లో సోదాలు చేసేందుకు కోటారెడ్డి కొందరు మనుషుల్ని పంపించారు. నాకు, మా బావకు వ్యక్తిగతంగా గన్ లైసెన్స్‌లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో తన గన్ సరెండర్ చేయడానికి మా బావే నాకు ఆథరైజేషన్ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఇద్దరి గన్స్ సరెండర్ చేస్తే పోలీసులు మా బావ గన్ మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇదంతా కుట్రలో భాగంగానే సాగుతోంది. నేను బావ బాధితుడిని’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment