ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటామని, వారి సంక్షేమం కోసమే పని చేస్తున్నామని మైనార్టీ కమిషన్ చైర్మన్
ముస్లింలకు మైనార్టీ కమిషన్ చైర్మన్ సుధీర్ భరోసా
హన్మకొండ అర్బన్ : ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటామని, వారి సంక్షేమం కోసమే పని చేస్తున్నామని మైనార్టీ కమిషన్ చైర్మన్ సుధీర్ అన్నారు. మైనార్టీలకు అమలవుతున్న పథకాల గురించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించారు. విద్యాశాఖలో ముస్లింల కోసం అమలు చేస్తున్న పథకాలను జిల్లా విద్యాశాఖాధికారి రాజీవ్ చైర్మన్ బృందానికి వివరించారు. విద్యాసంస్థల్లో 70 శాతం కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉంటే ఆ సంస్థకు మైనార్టీ స్టేటస్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలో 14 ఉర్దూ మీడియం పాఠశాలలు, 59 మదర్సాలు ఉన్నాయని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్ధికి ఉపకార వేతనాలు ఇస్తున్నామని ఏజేసీ తిరుపతిరావు తెలిపారు.
డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 153 ముస్లిం ఎస్‌హెచ్‌జీలకు రూ.1.91 కోట్లు లింకేజీ రుణాలు అందించామని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. భూమి లేకపోవడంతో ముస్లిం సంఘాలు డెరుురీ ఏర్పాటుకు ఆసక్తి చూపడం లేదన్నారు. జిల్లాలో 15 వేల మందికి వృద్ధాప్య, 80 మందికి వికలాంగ పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. మెప్మా ఏవో ఆంజనేయులు మాట్లాడుతూ నగరం పరిధిలో 68 శాతం మందికి లింకేజీ రుణాలు ఇచ్చామన్నారు. సబ్సిడీ లేని కారణంగా రుణాలు పొందేందుకు ఎక్కువ మంది ముందుకు రావడం లేదని తెలిపారు.జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 65 వేల మంది ముస్లింలకు తెల్ల రేషన్‌కార్డుల ద్వారా సరుకులు అందజేస్తున్నామని ఆయన అన్నారు.
మార్చి నాటికి పథకాల్లో ప్రగతి : కలెక్టర్
సహజంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు ఆర్ధిక సంవత్సరం చివరలో వస్తుంటాయని, అందువల్ల మార్చినాటికి పథకాల అమల్లో ప్రగతి కనిపిస్తుందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. సబ్సిడీ రుణాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని నిబంధనలు ఉన్నందున కొందరికి ఆవగాహన లేక దరఖాస్తులు చేయడం లేదని తమ దృష్టి వచ్చిందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గ్రామస్థాయిలో ఆవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో మత సహనం ఎక్కువని, మతపరమైన ఘర్షణలకు ఆస్కారం ఉండదని చెప్పారు. సమావేశంలో కమిషన్ సభ్యులు ఖాన్, ప్రొఫెసర్ షాబాన్, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.