చెరుకు రైతుకు చేటు కాలం! | Sugarcane farmer that's a long time! | Sakshi
Sakshi News home page

చెరుకు రైతుకు చేటు కాలం!

Published Fri, Feb 26 2016 4:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

చెరుకు రైతుకు చేటు కాలం!

చెరుకు రైతుకు చేటు కాలం!

 దిగుబడికి రవాణా దెబ్బ!
దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీల మూసివేత ఫలితం

 
 కోరుట్ల : షుగర్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకునే అంశంపై నెలకొన్న సందిగ్ధత రైతులను నష్టాలపాలు చేస్తోంది. గత సీజన్‌లో చెరకు క్రషింగ్ నిర్వహించిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలు ఈ ఏడాది చేతులెత్తేశాయి. దక్కన్ షుగర్స్ నిర్వహణ కింద ఉన్న కరీంనగర్ జిల్లా ముత్యంపేట, నిజామాబాద్ జిల్లా బోధన్, మెదక్ ప్యాక్టరీల పరిధిలో చెరుకు సాగు చేసిన రైతులు క్రషింగ్ కోసం పంటను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి మించి చెరకు తరలింపు.. క్రషింగ్ పూర్తయింది. స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలు మూత పడటంతో ఇతర ప్రాంతాలకు చెరకును తరలించక తప్పని పరిస్థితుల్లో రైతులు పెద్ద మొత్తంలో నష్టపాలయ్యారు.


దక్కన్ షుగర్స్‌కు చెందిన మూడు ఫ్యాక్టరీలు మూత పడడంతో ఆయా ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును ఇతర ఫ్యాక్టరీలకు తరలించినందుకు అయిన రవాణా ఖర్చులు ప్రస్తుతానికి రైతులే భరించాల్సి వచ్చింది. రవాణా ఖర్చులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఖర్చులు ఎప్పుడు ఇస్తుందోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ ఏడాది చెరుకు క్రషింగ్ కోసం కరీంనగర్ జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీ, మాఘీ ఫ్యాక్టరీకి చెరకు తరలించారు. ఈ రెండు ఫ్యాక్టరీలు ముత్యంపేటకు 100 నుంచి 150 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి.

బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతుల్లో కొందరు మహారాష్ట్రలోని చెరకు ఫ్యాక్టరీలకు 120 కిలోమీటర్ల పైగా దూరం క్రషింగ్ కోసం తీసుకెళ్లగా మరికొందరు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని గాయత్రి ఫ్యాక్టరీకి చెరకు తరలించారు. మెదక్ జిల్లాలోని దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు సంగారెడ్డి, జహీరాబాద్ ఫ్యాక్టరీలతోపాటు కామారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీకి తరలించారు.


 రవాణాభారం
సుదూర ప్రాంతాలకు చెరకును క్రషింగ్ కోసం తరలించిన రైతులకు రవాణా భారం మీద పడడంతోపాటు దిగుబడి నష్టపోయినట్లయింది. ముత్యంపేట, బోధన్, మెదక్ ఫ్యాక్టరీల పరిధి నుంచి 100 కిలోమీటర్ల దూరానికి మించి చెరకును తరలించిన రైతులు కనీసం పది శాతం చెరకు బరువు తగ్గిపోయి నష్టాలు ఎదుర్కొన్నారు. క్రషింగ్ చేస్తున్న ఫ్యాక్టరీకి చెరకును చేర్చినప్పటికీ అక్కడ రెండు రోజులకు మించి వెయిటింగ్‌లో ఉండాల్సి రావడంతో పంట ఎండిపోయి బరువు తగ్గిపోతోంది. స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలకు చెరకును తరలించిన సమయంలో ఓ లారీకి 20 టన్నుల బరువు తూగేది.

ప్రస్తుతం దూరప్రాంతాలకు తరలిస్తే లారీ చెరకు కేవలం 18 టన్నులు మాత్రమే తూగుతోందని రైతులు వాపోతున్నారు. ఈ లెక్కన రైతులు ఒక్కో లారీకి రెండు టన్నులు అంటే రూ.5 వేలు నష్టపోతున్నారు. ఎకరానికి దిగుబడి 35 నుంచి 40 టన్నులు లెక్కన రవాణా ఫలితంగా రూ.10 వేలు నష్టం జరుగుతోంది. ఈ లెక్కన ఒక్క ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 3 వేల ఎకరాల్లో చెరకు సాగు చేసిన రైతులు రూ.3 కోట్లు నష్టపోయారు. మూతపడ్డ మూడు దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీలను లెక్కలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.10 కోట్లపై మాటే. ఈ సీజన్‌లో రైతులకు ఎదురైన కష్టాలు దృష్టిలో ఉంచుకుని కనీసం వచ్చే ఏడాదైనా ప్రభుత్వం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపించాలని రైతులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement