హేమలతా.. నన్ను క్షమించు | Suicide written Rural Bank temporary employee commits suicide | Sakshi
Sakshi News home page

హేమలతా.. నన్ను క్షమించు

Published Thu, Mar 12 2015 12:16 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

Suicide written Rural Bank temporary employee commits suicide

- పిల్లలు,అమ్మ నాన్నా జాగ్రత్త
- ఉద్యోగం పర్మినెంట్  కాలేదని వేదన
- సూసైడ్ రాసి గ్రామీణ  బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి ఆత్మహత్య
- అనంతగిరిపల్లి  శివారులో ఘటన
- మృతుడు ప్రజ్ఞాపూర్ వాసి

వర్గల్ :‘ఇరవై ఏళ్లుగా బ్యాంకులో పనిచేస్తున్నా ఉద్యోగం పర్మినెంట్ కాలేదు. చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు... ఎవరైనా ప్రభుత్వ సంస్థల్లో టెంపరరీగా పని చే యొద్దు... హేమలతా.. నన్ను క్షమించు. తేజస్విని, వంశీని, అమ్మ, నాన్నలను మంచిగా చూసుకో’.. అని సూసైడ్ నోట్ రాసి గ్రామీణ వికాస్ బ్యాంక్ తాత్కాలిక ఉద్యోగి పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు.  ఈ ఘటన బుధవారం మండలంలోని అనంతగిరిపల్లి శివారు రాఘవేంద్ర కాలనీ వద్ద వెలుగు చూసింది. గౌరారం ఎస్‌ఐ మధుసూదన్‌రెడి కథనం ప్రకారం...
 
గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన పెర్క ఉప్పలయ్య(38)కు భార్య హేమలత, వంశీ(10), తేజస్వీ(4) అనే ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ప్రజ్ఞాపూర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన పని చేశాడు. ఏడాది నుంచి జగదేవ్‌పూర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఆశతో ఇబ్బందులను భరి స్తూ నెట్టుకొస్తున్నాడు. వేతనం సరిపోక కుటుంబ పోషణ భారం కావడ ంతో ఆర్థి క సమస్యలు ఎదురయ్యాయి. అప్పులు పెరిగాయి. ఒకవైపు ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం పర్మినెంట్ కాలేదని బాధ, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు అతణ్ణి మనోవేదనకు గురిచేశాయి. మంగళవారం ఉదయం డ్యూటీ నిమిత్తం జగదేవ్‌పూర్‌లోని గ్రామీణ వికాస్ బ్యాంకుకు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయలుదేరాడు.

చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు బ్యాంకు వారిని వాకబు చేస్తే రాలేదని తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బంధువులు, తెలిసిన వారిని ఆరా తీసినా ఫలితం దక్కలేదు. వర్గల్ మండలం అనంతగిరిపల్లి శివారులో ఉప్పలయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడినట్లు గౌరారం పోలీసులు బుధవారం ఉదయం గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్ మృతుని జేబులో లభించింది. వెంటనే ప్రజ్ఞాపూర్‌లోని కుటుంబీకులకు సమాచారమిచ్చారు. డ్యూటీకి వెళ్లిన ఉప్పలయ్య శవంగా మారాడనే పిడుగులాంటి వార్త తెలియడంతో భార్య హేమలత, తల్లిదండ్రులు, పిల్లలు హతాశులయ్యారు. పెద్దదిక్కు కోల్పోయి అల్లాడిపోయారు.

గజ్వేల్ ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహంపై పడి బోరుమని విలపించారు. డాడీ అంటూ విలపిస్తున్న కొడుకును ఆపడం అక్కడున్న వారి తరం కాలేదు. ఓవైపు కుటుంబీకులు, మరోవైపు బంధువులు, మిత్రుల రోదనలతో ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం అలుముకున్నది. భార్య హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు గౌరారం ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement