ఇద్దరు పిల్లల గొంతునులిమి ఆత్మహత్య చేసుకున్న దంపతులు
నలుగురి ఉసురు తీసిన ఫైనాన్స్ వ్యాపారం
కుటుంబ పోషణకు ఎంచుకున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు వెన్నాడాయి. చివరకు ఎంతో మోజుతో కట్టుకున్న ఇల్లు కూడా అప్పుల తీర్చేందుకు ఆహుతైంది. అయినా అప్పులు తీరలేదు.... జీవనంలో మార్పు రాలేదు. దీంతో బతుకు భారమైంది. అప్పులు ఇచ్చిన వారి నుంచి నిరంతరం హెచ్చరికలు అందుతున్నాయి... దిక్కుతోచలేదు. ఆత్మహత్యనే శరణ్యంగా భావించినా దంపతులు... తాము మరణిస్తే పిల్లలు అనాథలుగా మారుతారని లోలోనా కుమిలిపోయారు. అంతే... కన్న పేగు పాషాణమైంది. నిద్రిస్తున్న పిల్లల గొంతు నులిమి... తామూ.... శివమొగ్గ : వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దంపతులు తమ ఇద్దరు పిల్లలను నిద్రలోనే హతమార్చి తామూ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. శివమొగ్గ జిల్లా సాగర తాలూకా పోలీసుల సమాచారం మేరకు... చిక్కమంగళూరుకు చెందిన సురేష్(38)కు భద్రావతికి చెందిన గాయత్రి(28)తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి షాలినీ(8), ఇంద్రజిత్(3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి వచ్చి సాగర్‌కు వచ్చిన సురేష్ ఇక్కడే ఇల్లు నిర్మించుకుని ఫైనాన్స్ వ్యాపారం మొదలు పెట్టాడు.
కొత్తలో కొద్ది మేర వ్యాపారం సజావుగా సాగినా... రానురాను నమ్ముకున్న వాళ్లు మోసం చేయడంతో నష్టాలు రావడం మొదలైంది. వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు తెలిసిన వారి వద్ద నుంచి అప్పు చేసి పెట్టుబడులు సమకూర్చుకున్నాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. వ్యాపారం పూర్తిగా నష్టపోవడంతో అప్పులు మిగిలాయి. అప్పుల వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అవుతుండడంతో ఉన్న ఇంటిని అమ్మి కొందరికి చెల్లించాడు. కుటుంబాన్ని జేపీ నగర్‌లోని అద్దె ఇంటికి మార్చాడు. ఈ నేపథ్యంలోనే తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలంటూ మళ్లీ ఒత్తిళ్లు మొదలయ్యాయి. పరిపరివిధాలుగా నచ్చచెప్పినా అప్పులు ఇచ్చిన వారు ససేమిరా అన్నారు. దీంతో దిక్కుతోచలేదు. భార్యతో కలిసి వేదనను పంచుకున్నాడు. అయినా ఇద్దరికీ మనస్థైర్యం దక్కలేదు. దీంతో సోమవారం తెల్లవారుజామున తమ సొంత ఊరు తరికెరెలో ఉన్న బంధువులకు సురేష్ ఫోన్ చేశాడు. తాము అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు. నిద్రిస్తున్న ఇద్దరు పిల్లల గొంతు నులిమి హతమార్చారు.
అనంతరం ఒకే ఛైర్‌పై దంపతలిద్దరూ నిలబడి ఉరి వేసుకున్నారు. తరికెరెలో ఉన్న వారి నుంచి ఫోన్ సమాచారం అందుకున్న సాగర్‌లో ఉన్న బంధువులు ఉదయం ఆరు గంటలకు సురేష్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. గదిలో వృతదేహాలు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని డీవైఎస్పీ నందిని, ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి పరిశీలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో స్థానికులు కంటనీరు పెట్టారు.
కన్నపేగు పాషాణమైంది!
Published Tue, Feb 24 2015 1:43 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement