కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి
- వారం రోజుల ఉత్కంఠకు తెర
- పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
పెందుర్తి : వారం రోజుల ఉత్కంఠకు తెరపడింది. దామోదర్(9) కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన కొరుబిల్లి దామోదర్ క్షేమంగా బయటపడ్డాడు. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సోమవారం చాకచక్యంగా ఛేదించారు. దీంతో బాలుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
జరిగిందిదీ: చింతలగ్రహారం గవరపాలెం కాలనీకి చెందిన కొరుబిల్లి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు యామిని, దామోదర్ సంతానం. శ్రీనివాసరావు ఫైనాన్స్ వ్యాపా రం చేస్తున్నారు. గత సోమవారం రాత్రి శ్రీనివాసరావు కుమారుడు దామోదర్ స్థాని క వినాయక మండపం వద్దకు వచ్చిన సమయంలో కొందరు దుండగులు ఆ బాలుడ్ని కిడ్నాప్ చేశారు.
బుధవారం ఉదయం శ్రీనివాసరావుకు కొత్తపాలెం సమీపంలోని కాయిన్‌బాక్స్ నుంచి ఫోన్ చేసి రూ.30 లక్ష లు డిమాండ్ చేశారు. దీనిపై గత బుధవా రం సాయంత్రం ఫిర్యాదు అందుకున్న పో లీసులు రంగంలోకి దిగారు. ఆరు రోజుల పాటు డీసీపీ రామ్‌గోపాల్‌నాయక్, నార్త్ ఏ సీపీ సీ.ఎం నాయుడు జిల్లావాప్తంగా బృం దాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
చాకచక్యంగా: ఈ కేసు ఛేదనలో పోలీసు లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. బాలు డ్ని అపహరించుకుపోయిన వారు తరుచూ కాయిన్‌బాక్స్‌ల నుంచి ఫోన్లు చేయడంతో నగరంలో ఉన్న కాయిన్‌బాక్స్‌ల వద్ద ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గోపాలపట్నం జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల వద్దకు వచ్చిన ఓ కిడ్నాపర్ బాలుడి తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు.
అదే సమయంలో అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు అతడ్ని పట్టుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నిందితుడ్ని విచారించగా పెందుర్తి వుడా కాలనీ సమీపంలో రెల్లి కాలనీ కొండపై ఓ తాటాకుల పాకలో దామోదర్‌ను ఉంచినట్టు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులు బాలుడ్ని గుర్తించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
మొత్తం ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుల్లో ఒకరు చింతలగ్రహారం వాసి కాగా, మిగిలిన వారు పెందుర్తి ప్రాంతానికి చెందిన వారుగా తెలిసింది. తండ్రి ఆర్థిక లావాదేవీలే దామోదర్ కిడ్నాప్‌కు కారణమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
ఆనందోత్సాహాలు: వారం రోజులుగా కిడ్నాపర్ల చెరలో ఉన్న దామోదర్ క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. దామోదర్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. బాలుని తల్లి మాట్లాడుతూ కేసును ఛేదించిన పోలీసులకు, సహకరించిన మీడియాకు, ప్రార్థించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటలకు దామోదర్‌ను కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స అనంతరం బాలుడి తండ్రి శ్రీనివాసరావుతో కలసి డీసీపీ చింతలగ్రహారం వెళ్లారు. అక్కడ దామోదర్‌ను వారికి అప్పగించారు.
పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో..
పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రెల్లి కాలనీలోని ఓ పాకలో దామోదర్‌ను ఉంచడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ వారం రోజు ల పాటు కిడ్నాపర్లు పోలీస్‌స్టేషన్ సమీపం నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించినట్టు గుర్తించారు. బాలుడికి ఆహారం కూడా పోలీస్‌స్టేషన్ సమీపంలోని దుకాణాల నుంచే తీసుకువెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. కాయిన్‌బాక్స్ నుంచి ఫోన్ చేసేందుకు మాత్రం గోపాలపట్నం వెళ్లేవారు.