కరీంనగర్, న్యూస్‌లైన్ : రోజు రోజుకూ ఎండలు ముదురుతున్నాయి. ఉదయం పదకొండు గంటలకే భానుడు భగభగ మండుతున్నాడు. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఎండలకు తోడు కరెంటు కోతలు తోడు కావడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారం రామగుండంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లా కేంద్రంలో 41 డిగ్రీలు నమోదైంది. వేసవికాలం ప్రారంభ సమయంలోనే జిల్లాలో ఎండలు ఇలా మండిపోతుంటే పరిస్థితి ముందు ముందెలా ఉంటుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి.
వారం రోజుల నుంచే భానుడి ప్రతాపానికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9గంటల నుంచి సూర్యప్రతాపం మొదలవుతుంది. మధ్యాహ్నం వేళ భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో ఎండవేడిమి మరింత ఎక్కువవుతోంది. దీంతో పట్టణం పల్లె అనే తేడా లేకుండా వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలకు భయపడి జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.
తప్పనిసరి అయితే గొడుగులు, చేతిరూమాలు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు పార్టీ జెండాలు, కరపత్రాలే నీడనిస్తున్నాయి. మరోవైపు పగటి వేళల్లో కరెంటు కోతలు విధిస్తుండడంతో జనం ఉక్కపోత భరించలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఎండవేడిమికి భయపడి ఉదయం 6.30కే ఉపాధి పనులకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇళ్లకు చేరుతున్నారు.
జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతానికి తోడు సింగరేణి గనులు విస్తరించి ఉండడంతో రామగుండం, మంథని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పర్యావరణం దెబ్బతినడంతో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
విద్యుత్ కోతలతో ఉక్కిరిబిక్కిరి
ప్రస్తుతం జిల్లా కేంద్రంలో నాలుగు గంటలు, డివిజన్ కేంద్రాల్లో ఆరు గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. నాలుగురోజులుగా అనధికారికంగా మరో రెండుమూడు గంటలు కోత పెడుతున్నారు. రాత్రివేళల్లో సైతం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. మండలకేంద్రాలు, గ్రామాల్లో అయితే పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కరెంటు కోతలతో ప్రజలు ఉక్కపోత భరించలేకపోతున్నారు.
ఎన్నికల విధులకు అంతరాయం
ఎన్నికల సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పగలు, రాత్రి పని ఉంటుంది. గంట గంటకు నివేదికలు పంపాల్సి ఉంటుంది. విద్యుత్‌కోతలతో అధికారులు చెమటలు కక్కుతున్నారు. కోన్ని చోట్ల కంప్యూటర్లు పనిచేయడం లేదు. రెండు గంటల కంటే ఎక్కువసేపు ఉండకుండా ఆఫ్ అవుతున్నాయి. దీంతో ఎన్నికల విధులకు అంతరాయం కలుగుతోంది. ఉక్కపోతతో కార్యాలయాల్లో గంట సేపు కూడా కూర్చొని పనిచేసే పరిస్థితి లేదని ఉద్యోగులు అంటున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరాను మెరుగుపర్చాలని పలువురు కోరుతున్నారు. మరోవైపు ఎండ వేడిమి, కరెంటు కోతలతో ఉక్కపోత భరించలేక పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.