మండుతున్న ఎండలతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే మే నెల ఎండలను తలపిస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఎండలకు తట్టుకోలేకపోతున్న వృద్ధులు, చంటి పిల్లలు
తల్లాడ: మండుతున్న ఎండలతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే మే నెల ఎండలను తలపిస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చంటి పిల్లలు ఎండలకు తట్టుకోలేక అల్లాడి పోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎండలకు భయపడి జనం బయటకు రావటం లేదు. పది గంటలలోపే తమ పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లి పోతున్నారు. సాయంత్రం 5గంటల తర్వాత మళ్లీ మండల కేంద్రానికి వస్తున్నారు.
దీంతో జన సంచారం కన్పించటం లేదు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి ఎండలు కాస్తుండటంతో జనం అల్లాడి పోతున్నారు. ఈ నెలలోనే ఎండలు భగ్గుమంటుంటే మే నెలలో ఎంత తీవ్రంగా ఉంటాయోనని హడలి పోతున్నారు.
అంగన్ వాడీల్లో చిన్నారుల ఇక్కట్లు..
అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లే పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలు రేకుల షెడ్లు, ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నందున ఉక్క పోతకు చిన్నారులు గురౌతున్నారు. అంగన్ వాడీల సమయ వేళల్లో మార్పు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.