ఎండలు మళ్లీ మండుతున్నాయి. భానుడు ప్రతాపానికి మార్చి, ఏప్రిల్ మాసాల్లో పగటి ఊష్ణోగ్రతలు
నల్లగొండ టౌన్ : ఎండలు మళ్లీ మండుతున్నాయి. భానుడు ప్రతాపానికి మార్చి, ఏప్రిల్ మాసాల్లో పగటి ఊష్ణోగ్రతలు జిల్లాలో 47 డిగ్రీలకు చేరడంతో జనం తల్లడిల్లిపోయారు. మే మొదటి నుంచి వరుణుడు కరుణించి జిల్లా అంతటా నాలుగు ఐదు రోజులు వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడి కొంత ఉపశమనం పొందారు. వర్షాల కారణంగా జిల్లాలో 33 డిగ్రీల సెల్సియస్‌గా ఊష్ణోగ్రతలు నమోదు కావడం ప్రజలను ఊరడించింది. తిరిగి ఈనెల 7నుంచి క్రమంగా ఊష్ణోగ్రతలుపెరిగిపోతున్నాయి. శనివా రం ఏకంగా 41.6 డిగ్రీల సెల్సియస్‌గా పగటి ఊష్ణోగ్రత నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. వడగాలులు, ఊక్కపోతతో ఉదయం 10 నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితుల ఏర్పడుతున్నాయి. పట్టణంలోని రోడ్లన్ని మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. రాత్రి 10 వరకు కూడా వడగాలులు వీస్తుండడం వల్ల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.
ఎడాపెడా విద్యుత్ కోతలు...
తెలంగాణ రాష్ట్రంలో సెకన్ కూడా విద్యుత్ కోతలు ఉండవని ముఖ్యమంత్రితో పాటు విద్యుత్ మంత్రి బాకాలు ఊది మీరి చెప్పుతుంటే జిల్లాలో విద్యుత్ అధికారులు ఎడాపెడా అనధికార కోతలు విధిస్తున్నారు. పట్టణంలో ఎప్పుడు విద్యుత్‌ను నిలిపివేస్తారో తెలియని పరిస్థితి. ఎండలు మండుతుండడం, ఉక్కపోతలు, విద్యుత్ కోతలు కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ అధికారులు ఎండలు మండుతున్న తరుణంలో మరమ్మతుల సాకుగా చూపుతూ మిట్ట మధ్యాహ్నం కోతలను విధిస్తుండడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండలను దృష్టి పెట్టుకుని కోతలు విధించవద్దని కోరుతున్నారు.