సాక్షి, హైదరాబాద్: దేశంలో హింసకు పాల్పడుతోన్న పాక్ ఉగ్రమూకకు బుద్ధిచెప్పిన వాయుసేనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని, కశ్మీర్ పరిష్కారంలో కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా తమ పార్టీ మద్దతిస్తుందని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్ సమస్యకు మూల కారణం కాంగ్రెస్ పార్టీనేనని, నెహ్రు విధానాలతోనే ఈ సమస్యను రాచపుండుగా మార్చాయని బూర దుయ్యబ ట్టారు. కశ్మీర్‌కు తెలంగాణకు సారూప్యతలు ఉన్నాయని, ఈ రెంటికీ కారణమైంది నెహ్రూనేనని ఆరోపించారు. పటేల్ సమర్ధత వల్లే అప్పుడు తెలంగాణ భారత్‌లో విలీనమయ్యిందని, లేదంటే కశ్మీరు లాగే తెలంగాణ నిత్యం రగిలేదని గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందనడానికి ఇవే నిదర్శనమన్నారు. కశ్మీరు, అయోధ్య సమస్యలకు పరిష్కారం కేసీఆర్ వంటి విజనరీ నాయకుల వల్లే సాధ్యమవుతుందన్నారు.
మా పోరాటాల వల్లే ప్రయోజనాలు
తమ పార్టీ ఎంపీల పోరాటాల వల్లే తెలంగాణకు కొన్ని ప్రయోజనాలు చేకూరాయన్నారు. తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను తీసుకురావడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైతే తాము పోరాడి సాధించుకున్నామన్నారు. ‘హైకోర్టును పోరాడి సాధించుకున్నాం, సొంత పనుల కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ఏనాడూ ఏదీ అడగలేదు. ఎయిమ్స్ తెలంగాణకు వచ్చిందంటే అది టీఆర్‌ఎస్ ఘనతే. పార్లమెంటులో ప్రజా సమస్యలపై గొంతెత్తడంలో టీఆర్‌ఎస్ ఎంపీలు రాజీ లేని ధోరణి ప్రదర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఏకపక్ష మద్దతు ఇస్తారు. కాశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు టీఆర్‌ఎస్ మద్దతునిస్తుంది’ అని బూర స్పష్టం చేశారు.
ఏకాకిని చేయాలి: ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి
పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడిని దేశంపై జరిగిన దాడిగా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. దేశాన్ని రక్షించుకునేందుకు భారత వాయు సేన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడి జరపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసే చర్యలన్నిటినీ కేంద్రం తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment