ఉద్యోగులకు అండగా ఉంటా.. | Support to the employees says Deputy Chief Kadiyam Srihari | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు అండగా ఉంటా..

Published Fri, Apr 10 2015 3:06 AM | Last Updated on Thu, May 24 2018 2:02 PM

Support to the employees says Deputy Chief Kadiyam Srihari

డిప్యూటీ సీఎం కడియం
 
ఉద్యోగులకు అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి శ్రీహరి అన్నారు. హన్మకొండలో గురువారం జరిగిన టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్ అభినందన సభలో పాల్గొని మాట్లాడారు..
 
హన్మకొండ : ఉద్యోగులకు అండగా ఉంటానని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. టీఆర్‌ఎస్‌లోకి రావడం వల్ల తనకు అన్నీ మంచి శకునాలే జరిగాయని అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్ అభినందన సభ గురువారం జరిగింది. సభలో కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టీఎన్జీవోస్ యూనియన్, ఉద్యోగ జేఏసీ నాయకులతోపాటు తనను అభిమానించే వారు, తెలంగాణ కోరుకునే శక్తులు టీడీపీలో ఎన్ని రోజులుంటారు.. అందులోంచి బయటకు రావాలని వత్తిడి తెచ్చారని గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఎంపీగా ఎన్నికయ్యాయని, ఊహించకుండానే డిప్యూటీ సీఎం అయ్యూనన్నారు. జిల్లాకు చెందిన కారం రవీందర్‌రెడ్డి టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక  కావడం గర్వకారణమన్నారు. దేవీప్రసాద్ సలహాలు, సూచనలు తీసుకొని అధ్యక్షుడిగా రాణించాలన్నారు. రవీందర్‌రెడ్డికి, హమీద్‌కు ఉద్యోగులు చేదోడు వాదోడుగా ఉండాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చెందకుండా ఇంకా కొందరు ప్రత్యక్షంగా, పరోక్షం కుట్రలు చేస్తున్నారన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములు కావాలన్నారు. దేవీప్రసాద్‌కు టీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరని, ఏదో ఒక అవకాశం కల్పిస్తారన్నారు.

జిల్లాకు దక్కిన గౌరవం: కారం రవీందర్‌రెడ్డి,టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు

టీఎన్జీవోస్ యూనియన్‌కు తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవమని కారం రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా ఉద్యోగులు అం దించిన సహకారంతో తాను ఈ స్థాయికి వచ్చానన్నా రు. రాష్ట్ర సాధన, ఉద్యోగుల సమస్యల సాధనకు జరి గిన పోరాటంలో జిల్లా ఉద్యోగులు కనబరిచిన పాత్ర అమోఘమన్నారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వం టీఎన్జీవోస్ యూనియన్‌కు కేఆర్.ఆమోస్ నుంచి ఇప్పటివరకు అందించిన అన్ని నాయకత్వాల మార్గంలో తాము సేవలందిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం అదనంగా రెండు గంటలు పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యోగులం నడుచుకుంటామన్నారు.

టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమం సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్, ఉద్యోగులం ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల కుటుంబాలకు ఒకటిన్నర రోజు జీతం విరాళంగా ఇచ్చి ఆదుకున్నామన్నారు. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను జూన్ వరకు పొడిగించిందని, దీనిని అక్టోబర్ వరకు పొడిగించే అవకాశముందని చెబుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈనెల 19న కాకతీయ మిషన్ కార్యక్రమంలో శ్రమదానం చేయనున్నట్లు చెప్పారు.

సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హామీద్ మాట్లాడుతూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్‌ను టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా శాఖ, ఉద్యోగ జిల్లా శాఖ, టీఎన్జీవోస్ యూనియన్ ఆయా ప్రభుత్వ శాఖల యూనిట్‌లు, ఇతర ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ఘనంగా పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించాయి. కాగా, డీసీసీబీ చైర్మన్ జంగా రాాఘవరెడ్డి కారం రవీందర్‌రెడ్డిని సన్మానించారు.

టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, టీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నాయకులు ఇండ్ల నాగేశ్వర్‌రావు, జోరిక రమేశ్, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీజీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌రావు, టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర నాయకులు రేచల్, జిల్లా నాయకులు రత్నవీరాచారి, హసనుద్దీన్, ఈగ వెంకటేశ్వర్లు, సురేందర్‌రెడ్డి, రత్నారెడ్డి, సదానందం, బి.రాము, బి.సోమయ్య, శ్యాంసుందర్, రాంకిషన్, ఇబ్రహీం హుస్సేన్, మాధవరెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాస్, సాదుల ప్రసాద్, సామ్యేల్, కత్తి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement