భూమిని కాపాడుకుంటేనే బతుకు
♦ రైతుల బతుకు మారడం లేదు
♦ రైతుల స్థితిగతులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని కాపాడుకుంటేనే రైతులు బతుకు నిలుపుకొంటారన్నారు. పటిష్ట రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు భూ వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు రెవెన్యూ రికార్డుల్లో పక్కాగా పేర్లు నమోదయ్యేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. రెవెన్యూ చట్టాలను సరళంగా మార్చి స్థానిక భాషల్లోకి తీసుకొస్తే భూ వివాదాలకు సంబంధించి రైతుల పరిస్థితి కొంత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు రైతులకు పూర్తి సహాయ, సహకారాలు అందించాలని నల్సార్-ల్యాండెస్సాలను కోరారు. ఇప్పటికే ఈ రెండూ చేస్తున్న యత్నాలు, సాధించిన ఫలితాలు అత్యద్భుతమని ప్రశంసించారు. వాటిని కొనసాగించాలని సూచించారు. ల్యాండెస్సా రాష్ట్ర డెరైక్టర్ సునీల్‌కుమార్‌ను అభినందించారు.
‘పేదలకు అవసరమైన భూ సంబంధిత సేవలు-అనుభవాలు, అంచనాలు, కొత్త ఆలోచనలు’ అనే అంశంపై నల్సార్ విశ్వవిద్యాలయం, ల్యాండెస్సా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు శనివారం హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి.రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, నల్సార్ వైస్ ఛాన్సలర్ ఫైజన్ ముస్తఫా, రిజిస్ట్రార్ వి.బాలకష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ దవే ప్రధానోపన్యాసం చేస్తూ.. భూమితో రైతుకు విడదీయరాని బంధం ఉందన్నారు. వ్యవసాయమే రైతుకు జీవన గీతమని తెలిపారు. భూమిని కాపాడుకుంటేనే వారికి బతుకు సాధ్యమవుతుందన్నారు. భూమి మన స్వాధీనంలో ఉన్నంత మాత్రాన అది మనదైపోదని, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదైతేనే దానికి విలువ ఉంటుందని చెప్పారు.
పేదరికం, నిరక్షరాస్యత వల్లే...
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ పేదరికం, నిరక్షరాస్యత, భౌగోళిక పరిస్థితుల వల్ల రైతులు న్యాయం పొందలేకపోతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇలానే ఉందని తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటే తప్ప బీమా అందడం లేదన్నారు. పంట బీమా పథకాల గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ల్యాండెస్సాను కోరారు. ఎన్‌టీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని, అందుకు ప్రత్యామ్నాయంగా పటిష్ట రెవెన్యూ వ్యవస్థ తయారు కాలేదని చెప్పారు. అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో కలసి న్యాయమూర్తులు నల్సార్ విశ్వవిద్యాలయ ఆడిటోరియంను ప్రారంభించారు.
పేదల భూములు తీసుకోవడం ఎందుకు?
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ చూపు లేని కళ్లు ఉండి ప్రయోజనం లేదని, అలాగే హక్కులేని భూమి ఉన్నా ప్రయోజనం ఉండదని చెప్పారు. తగిన రికార్డులు లేకుంటే భూమికి భద్రత లేదని తెలిపారు. రైతు తన భూమి జోలికి వచ్చిన వ్యక్తిని ఏమాత్రం క్షమించడని పేర్కొన్నారు. రైతుకు భూమి ఆత్మ వంటిదని, ఆత్మ జోలికి వస్తే సహించడని చెప్పారు. వివిధ అవసరాల పేరిట పేదల భూములను ఇష్టారాజ్యంగా తీసుకోవడం ఏమాత్రం సరికాదని అన్నారు. ప్రభుత్వ భూములతోనే ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇష్టారాజ్యంగా పేదల భూములను, ముఖ్యంగా రైతుల భూములను తీసుకుంటే వారు పడే బాధను ఆయన వివరించారు.