
బీజేపీలో చేరిన నటుడు సురేష్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు సురేష్ బీజేపీలో చేరారు. బుధవారం ఇక్కడి బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కండువా కప్పి సురేష్‌ను బీజేపీలోకి ఆహ్వానించారు. ‘‘దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని ఓ సినిమాలో నూతన్‌ప్రసాద్ అన్నట్టుగానే ప్రస్తుతం దేశం అదే స్థితిలో ఉంది. ఈ పరిస్థితిపై నా ఆవేదనను కొన్నేళ్లుగా ఫేస్‌బుక్ ద్వారా వెల్లడిస్తున్నా. ప్రజలు కడుపు మంటతో రగిలిపోతున్నారు. మోడీ ప్రధాని అయితే దేశం గతి మారుతుంది.
ఆయన గెలుపునకు నా వంతు సాయం చేసేందుకే పార్టీలో చేరుతున్నా. మోడీ టీ అ మ్ముకుంటే కాంగ్రెస్ దేశాన్నే అమ్ముకుంది. భూగర్భం, ఉపరితలం, ఆకాశం, అంతరిక్షం.. ఇలా దేన్నీ వదలకుండా కుంభకోణాలు చేసింది’’ అని ఈ సందర్భంగా సురేష్ వ్యాఖ్యానించారు. అలాగే బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పరంజ్యోతి కూడా కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఆ పార్టీ మాజీ నేత పూర్ణచంద్ర రావు, వినోద్ దినకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ, వడ్డెర సంఘం నేత రామయ్య, న్యాయవాదులు వెంకటేశ్వర్లు, డాక్టర్ మోహన్‌రావు, వెంకటేశ్వరరావు, హరికుమార్, అనిల్ కుమార్, కేంద్రప్రభుత్వ యువజన సంక్షేమ విభాగం మాజీ డెరైక్టర్ నిర్మలాదేవి తదితరులు బీజేపీలో చేరారు.