ప్రగతినగర్ : ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా ప్రజలు బాగుండాలనే సంకల్పంతో సమగ్ర కు టుంబ సర్వే విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అధికారులకు, ఎన్యూమరేటర్లకు సూచించారు. శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సమగ్ర కుటుంబ సర్వేపై జోనల్ అధికారులు, ప్రత్యేక అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈనెల 17న జిల్లాలోని అన్ని మండలాల్లో రెండో విడత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినందున ఎన్యూమరేటర్లు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
బ్యాంకు ఉద్యోగులు కూడా శిక్షణకు హాజరయ్యేందుకు లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంకర్లందరికి తెలియజేయాలన్నారు. ఎన్యూమరేటర్లకు డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని తహశీల్దారులు, స్పెషల్ అధికారులు డ్యూటీ ఆర్డరుతో పాటు వాటిని తీసుకుని 17వ తేదీకల్లా ఎన్యూమరేటర్లకు అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు. 19వ తేదీన ఉదయం 6 గంటల కల్ల సంబంధిత మండల కేంద్రంలోని కార్యాలయం వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు, గ్రామాలకు వెళ్లేందుకు రూట్ ఆఫీసర్స్ సహకరిస్తారని తెలిపారు. మెటీరియల్‌తో కూడిన కిట్ బ్యాగులను ఎన్యుమరేటర్లకు అందజేస్తామన్నారు. కొత్తగా రూపొందించిన కర దీపికను తీసుకెళ్లాలని ఎన్యూమరేటర్లకు స్పెషల్ ఆఫీసర్లు చెప్పాలన్నారు.
జోనల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు ,గ్రామ స్పెషల్ ఆఫీసర్ల వద్ద రిజర్వు సిబ్బందిని కేటాయిస్తున్నామని, అవసరమైతే వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు 19వ తేదీన ఎన్యూమరేటర్ల బస్సులు బయలుదేరినప్పటి నుంచి సర్వే పూర్తి అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుండాలన్నారు. 17వ తేదీన జరిగే శిక్షణ కార్యక్రమంలో జోనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు అన్ని వివరాలు ఎన్యూమరేటర్లకు తెలియచేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో రాజారాం, ఐకేపీ పీడీ వెంకటేశం, డీపిఓ సురేష్‌బాబు, అధికారులు పాల్గొన్నారు.
కుటుంబ వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలి
ప్రభుత్వం నిర్దేశించిన ప్రోఫార్మలో ఎన్యూమరేటర్లు కుటుంబ వివరాలు సమాచారం తప్పులు లేకుండా నమోదు చేయాలని జిల్లా పరిషత్ సీఈవో రాజారాం సూచించారు. ఈనెల 12వ తేదీన అనివార్య కారణాల వల్ల శిక్షణకు హాజరుకాని ఉద్యోగులకు, ఎన్యూమరేటర్లకు శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలోప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచారం సరిగ్గా ఇవ్వకపోతే ఆ కుటుంబాల వారు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు అందక నష్టపోతారన్నారు.
అందువల్ల సర్వే ప్రాముఖ్యతను వారికి తెలియచెప్పి, వివరాలు తీసుకొని సమాచారం నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివిధ అంశాలలో ఏ విధంగా సమాచార నమోదు చేయాలో వివరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మంగతాయారు, పలువురు అధికారులు పాల్గొని ఎన్యూమరేటర్లకు అవగాహన కల్పించారు.
‘సర్వే’ విధులు సక్రమంగా నిర్వహించాలి
Published Sun, Aug 17 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement