సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ ఆస్తుల అద్దెలు, లీజులపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సీఈవోను ఆదేశించారు. గురువారం సచివాలయంలో వక్ఫ్ బోర్డుపై సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దెలు, లీజులు చాలా తక్కువగా వసూలవుతున్నాయని, మరో మారు సర్వే నిర్వహించి మార్కెట్ ధరల ప్రకారం నిర్ణయించాలని సూచించారు.
రెవెన్యూ సర్వే కొనసాగుతున్న దృష్ట్యా వక్ఫ్ భూముల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వక్ఫ్ సర్వే కమిషన్ కోసం రిటైర్డ్ ఉద్యోగుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో వక్ఫ్ సర్వే కమిషన్ సమర్పించిన నివేదికను మరోమారు పరిశీలించాలన్నారు. అలాగే ప్రభుత్వం కేటాయించే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌పై సమీక్షించారు. ఈ సమావేశంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, మైనారిటీ సంక్షేమ వ్యవహారాల సలహాదారుడు ఏకే ఖాన్, వక్ఫ్‌బోర్డు సీఈవో ఫారుఖీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment