
సాక్షి,నల్లగొండ: ఇంకెప్పుడు..? సోమవారం నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తరు..? వారెప్పుడు ప్రచారం చేసుకుంటరు..? ఇంకా పొత్తులు ఏమయ్యాయి, అభ్యర్థులు తేలక గందగోళమేంది..? ఆదివారమైనా అభ్యర్థులను ప్రకటిస్తరా .. లేదా..?’ .. అన్న చర్చ సగటు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. రోజుకో తీరున మారుతున్న కూటమి పొత్తులు చివరకు ఎవరికి నిరాశను మిగులుస్తాయో అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నలుగురు సిట్టింగ్ అభ్యర్థులకు దాదాపు టికెట్లు ఖరారు అయినట్లే. అవి అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉంది. కోదాడ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నా.. అక్కడ సిట్టింగ్ తిరిగి బరిలో ఉంటారన్న అభిప్రాయానికి కాంగ్రెస్ వర్గాలు వచ్చాయి. మరో వైపు ఆలేరు, భువనగిరి విషయంలోనూ ఎలాంటి సందేహాలు లేవని అంటున్నారు. అంటే.. ఆరు స్థానాల్లో స్పష్టత ఉన్నా.. మరో ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌నుంచి ఎవరు పోటీచేస్తారు..? సీపీఐకి ఏ స్థానం ఇస్తారు..? టీడీపీ అ డుగుతున్న స్థానాల మాటేమిటీ..? ఇంటి పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? తెలంగాణ జన సమితికి జిల్లాలో స్థానం కల్పిస్తారా.. అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
గడిచిన మూడు నాలుగు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అటు కాంగ్రెస్‌ను, ఇటు మహా కూటమి భాగస్వామ్య పక్షాలను ఆలోచనలో పడేస్తున్నాయి. తొలుత శుక్రవారం అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పినా, అది శనివా రం నాటికి వాయిదా పడింది. చివరకు శనివారం కూడా అలాంటి ప్రకటనేదీ వెలువడక పోవడంతో కనీసం ఆదివారమైనా ప్రకటిస్తారేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఆదివా రం మెజారిటీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఎందరికి తొలి జాబితా లో చోటు దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.కొనసాగుతున్న ఉత్కంఠ
ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ పడాలని, టికెట్లు కోరిన ఆశావహుల పేర్లను వడబోసిన కాంగ్రెస్ నాయకత్వం తొలి విడతలో 75 మంది తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందని, అందులో జిల్లాలో కచ్చితంగా ఆరు పేర్లు అయినా ఉంటాయని భావించారు.
రెండో జాబితాలో మిగిలిన స్థానాల్లో మహా కూటమి అభ్యర్థులతో కలిపి పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారన్న వార్తలూ వెలువడ్డాయి. దీంతో గడిచిన రెండు రోజులుగా టికెట్ల ప్రకటన కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు ఆశావహుల సంఖ్యను తగ్గించేందుకు ఏయే నియోజకవర్గాల్లో టికెట్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారో..? ఏ నియోజకవర్గంలో పరిస్థితి కొంత సమస్యాత్మకంగా ఉందని భావించారో ఆయా స్థానాల నుంచి ఆశావహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లేనని భావించి ప్రకటన కోసం ఎదురు చూసినా.. ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక తాజా రాజకీయాలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇంకా.. టికెట్ల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతుండడంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పొత్తుల .. కిరికిరి!
మరోవైపు జిల్లాలో మహా కూటమిలోని నాలుగు భాగస్వామ్య పక్షాలు టికెట్లు ఆశిస్తున్నాయి. టీడీపీ, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జనసమితి ఈ రేసులో ఉన్నాయి. కాంగ్రెస్‌కు నల్లగొండ, నాగార్జున సాగర్, హుజూర్‌నగర్, కోదాడలలో సిట్టింగ్‌లు ఉన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో టికెట్ పోటీదారులు లేరు. దీంతో అక్కడా అభ్యర్థుల ప్రకటనకు అడ్డంకులు లేవని భావించినా, సీపీఐ ఆలేరును కోరుతోంది. మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడెం, తుంగతుర్తి, నకిరేకల్.. ఈ అయిదు స్థానాల్లో అటు కాంగ్రెస్‌లో టికెట్లకు పోటీ ఉండడంతోపాటు, కూటమి భాగస్వామ్య పక్షాలు కోరుతున్న స్థానాలూ ఇవే కావడం, సూర్యాపేటలో ఇద్దరు నేతలు టికెట్ కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తుండడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. నకిరేకల్ సీటు వ్యవహారం ఒకింత వివాదాస్పదమైంది. ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా ఇంటి పార్టీకి ఇస్తున్నారని జరిగిన ప్రచారంతో కాంగ్రెస్ నేతలు అడ్డం తిరిగారు. మునుగోడును కాంగ్రెస్‌తో పాటు సీపీఐ బలంగా కోరుకుంటోంది. టీడీపీ కోదాడ, లేదంటే నకిరేకల్ ఇవ్వాలంటోందని చెబుతున్నారు. టీజేఎస్ మిర్యాలగూడపై కన్నేసింది. దీంతో పొత్తుల కిరికిరి అభ్యర్థుల ప్రకటనను మరింత జఠిలం చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment