సాక్షి, వరంగల్: మహాకూటమిలో సీట్ల పంపకం తుది అంకానికి చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పది సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధమైంది. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాలకు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతా సవ్యంగా సాగితే శనివారం సాయంత్రం వరకు తొలి జాబితా వెలువడే అవకాశం ఉంది. దుబాయి పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి కుంతియా హైదరాబాద్‌కు రాగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
పొన్నాలకు ఊరట
జనగామ నుంచి కోదండరాం పోటీ చేస్తారనే ఊహాగానాలకు జానారెడ్డి తెరదించారు. ఆ సీటు పొన్నాలకే ఖరారైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చర్చించిన తుది జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు లేనప్పటికీ.. తర్వాత మాట్లాడి టికెట్‌కు లైన్‌క్లియర్ చేశామని తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఏర్పడిన అయోమయం తొలగిపోయింది.
దొంతి మాధవరెడ్డికి ఓకే..
నర్సంపేట పీటముడి వీడిపోయింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కూటమి పొత్తులో భాగంగా ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డిని బుజ్జగించడంలో కూటమి సఫలమైంది. ఆయన కోరుకుంటే వరంగల్ పశ్చిమ, లేదా వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో ఏదైనా ఇస్తామని చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆయన సుముఖంగా లేకపోతే మరో మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పాలకుర్తిలో జంగా..భూపాలపల్లిలో గండ్ర..
పాలకుర్తి నియోజకవర్గం నుంచి జంగా రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే నేను సీనియర్ రౌడీ షీటర్‌ను, తనకే టికెట్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకుడు సుధీర్‌రెడ్డి మీడియాకు చెప్పిన నేపథ్యంలో పాలకుర్తి టికెట్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చివరకు కొండా దంపతులు.. జంగాను గెలిపించుకుని వస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి హామీ ఇవ్వడంతో రాఘవరెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇందిర..
స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామారావు, ఇందిర, మాదాసి వెంకటేష్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన దొమ్మటి సాంబయ్య పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఇందిర కొంత కాలంగా నియోజకవర్గంలోపార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. గ్రామాల్లో ఆమెకంటూ బలమైన కార్యకర్తల మద్దతు ఉండడంతో అధిష్టానం ఇందిర వైపు మొగ్గుచూపినట్లు సమాచారం.
ములుగుపై తర్జనభర్జన
ములుగు టికెట్ కోసం నువ్వా.. నేనా అన్నట్లు మాజీ ఎమ్మెల్యేలు దనసరి సీతక్క, పొదెం వీరయ్య పోటీ పడుతున్నారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇద్దరిలో ఎవరినో ఒకరిని భద్రాచలం నియోజకవర్గానికి పంపించాలనే ఆలోచన కూడా చేసింది. ఇద్దరు కూడా ససేమిరా అనడంతో పీటముడి ఏర్పడింది. సర్వేలు, పలువురి అభిప్రాయలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అధిష్టానం సీతక్క వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే పొదెం వీరయ్యను ఒప్పించిన తర్వాతే అధిష్టానం ప్రకటన చేసే అవకాశం ఉంది.
డోర్నకల్‌లో రాంచంద్రునాయక్.. మహబూబాబాద్‌లో బలరాం
మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి గుగులోతు సుచిత్ర, మురళీనాయక్, బలరాం నాయక్ పోటీపడ్డారు. భక్తచరణ్‌దాస్ కమిటీ చివరకు బలరాం నాయక్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. డోర్నకల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ రాంచంద్రునాయక్ పేరును ఎంపిక చేసినట్లు తెలిసింది.
పశ్చిమ, తూర్పునకు మరికొంత సమయం..
వరంగల్ అర్బన్ జిల్లాలో అనిశ్చితి అలాగే ఉంది. వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలపై మరింత కాలం సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడి అభ్యర్థుల ఖరారు కూటమి పార్టీల అభిప్రాయాలతో ముడిపడి ఉండడంతో రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. రేవూరి ప్రకాష్‌రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థులను ఖరారు చేసే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రబెల్లి స్వర్ణ పశ్చిమ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైతే నాయిని రాజేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి ఎవరికి వారుగా టికెట్ తమదే అనే ధీమాతో ఉన్నారు. వరంగల్ తూర్పు నుంచి టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అచ్చ విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా, మాజీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎండీ.ఇస్మాయిల్ షంశీతో పాటు మరికొందరు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment