‘స్వచ్ఛ'ందంగా కదిలారు...
పుస్తకాలు.. పెన్నులతో.. నిత్యం కుస్తీపట్టే.. చిట్టిచేతులు చీపుర్లు పట్టాయి.. నగరపాలక సంస్థ ఇచ్చిన స్వచ్ఛనగరం పిలుపుతో స్వచ్ఛందంగా కదిలివచ్చారు.. కార్యక్రమంలో సింహభాగమై చెత్తను తరిమే పనిపట్టారు.. చెత్తను రోడ్లపై వేసేవారికి కనువిప్పు కలిగించారు.. నగరంలోని గల్లీగల్లీలోకి వెళ్లి రోడ్లు ఊడ్చి.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల్లో స్ఫూర్తి నింపారు..
- టవర్‌సర్కిల్
స్వచ్ఛభారత్‌లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛనగరం- మన కరీంనగర్’ కార్యక్రమం శనివారం అన్ని డివిజన్లలో నిర్వహించారు. రోడ్లను ఊడ్చి, చెత్తను పోగుచేసి ట్రాక్టర్లలో పంపే వరకు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలంతా బాధ్యతగా పనులు నిర్వహించారు.
నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తరలివచ్చారు. ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, మున్సిపల్ నియమించిన ప్రత్యేకాధికారులతో కలిసి రోడ్లుఊడ్చి, చెత్తను తొలగించారు.
మూడు గంటలు.. యాభై డివిజన్లు..
‘స్వచ్ఛ నగరం - మన కరీంనగర్’ కార్యక్రమం ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని డివిజన్లలో జరిగింది. మూడు గంటలపాటు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉద్యమంలా పనులు చేపట్టారు. ఎక్కడ చూసినా స్వచ్ఛ భారత్ కనిపించింది.
డివిజన్‌కు వెయ్యి మందితో కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినా విద్యాసంస్థలు తక్కువగా ఉన్న డివిజన్లలో తక్కువగా, కొన్ని డివిజన్లలో ఎక్కువగా హాజరయ్యారు. లక్ష్యాన్ని చేరువగా వచ్చామని ప్రజాప్రతినిధులు, అధికారులు వెల్లడించారు.
పాశ్చాత్యదేశాలకు ధీటుగా - ఎమ్మెల్యే, మేయర్
పాశ్చాత్య దేశాలైన అమెరికా, లండన్, చైనాల్లో ఇంతమంది పారిశుధ్య కార్మికులు ఉండరని, ఎవరి పనిని వారే చేసుకుంటారని, అందుకే ఆ దేశాలు సుందరంగా కనబడతాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ అన్నారు. పలు డివిజన్లలో జరిగిన స్వచ్ఛ నగరం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... మనం కూడా ఎవరి చెత్తను వారే తొలగించుకుంటే ఆయా దేశాలకు ధీటుగా మనం నిలబడగలమన్నారు.
చెత్తలేని రహదారులపై చెత్త వేయాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకురావాలని కోరారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.ఒక్క రోజుతోనే స్వచ్ఛత పనులు నిలపవద్దని, పరిసరాల్లో ఎక్కడ చెత్త కనబడినా తొలగించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, బీజేపీ నాయకులు బండి సంజయ్, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, డీఎస్పీ జె.రామారావు, కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, చల్ల స్వరూపరాణి, కమల్జిత్‌కౌర్, చాడగొండ కవిత, ఏవీ.రమణ, మాచర్ల రజిత, ఎడ్ల స్వరూప, కంసాల శ్రీనివాస్, గందె మాధవి, వైద్యుల శ్రీదేవి, రవీందర్, వేణు, ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.