నేటితో వారందరూ మాజీలే.. | Governing Council Tenure Completed In Rajamahendravaram Municipal Corporation East Godavari | Sakshi
Sakshi News home page

నేటితో వారందరూ మాజీలే..

Published Tue, Jul 2 2019 7:52 AM | Last Updated on Tue, Jul 2 2019 7:52 AM

Governing Council Tenure Completed In Rajamahendravaram Municipal Corporation East Godavari - Sakshi

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ భవనం

సాక్షి, తూర్పు గోదావరి: ఐదేళ్ల రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాలకమండలి పదవీకాలం మంగళవారంతో ముగుస్తోంది. పాలక మండలి సభ్యులందరూ బుధవారం నుంచి మాజీలుగా మారిపోనున్నారు. వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్పొరేటర్లు 2014 జూలై రెండో తేదీన రాజమహేంద్రవరం నగర పాలకసంస్థ పాలమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన పంతం రజనీశేషసాయి వ్యవహరిస్తున్నారు. మళ్లీ కొత్త పాలకవర్గం ఎన్నికయ్యే వరకూ నగరపాలక సంస్థ పాలన అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో రాజమహేంద్రవరం నగరానికి విశిష్ట స్థానం ఉంది. ఈ చారిత్రక నగరంలో సుమారు నాలుగు లక్షల మంది జనాభా ఉన్నారు.

నగరాన్ని 50 డివిజన్లుగా విభజించారు. వాటిలో సిటీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 42 డివిజన్లు, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో 3,00, 546 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,45,319 మంది కాగా, మహిళలు 1,55,161 మంది. ఇతరులు 66 మంది జీవిస్తున్నారు. ఈ పాలకమండలిలో తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, స్వతంత్రులు కూడా కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. వారితో పాటు వివిధ వర్గాలకు చెందిన ఐదుగురు కో ఆప్షన్‌ సభ్యుల హోదాలో నగర పాలనలో భాగస్వాములుగా ఉన్నారు.

ఇది మూడో పాలకవర్గం
ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సార్లూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నిక కావడం విశేషం. 
గత ఐదేళ్లలో నగరాభివృద్ధి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, డివిజన్ల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దగా సహకరించలేదనే భావన ప్రజల్లో బలంగా ఉంది. పుష్కరాల సమయంలో కూడా నగరాన్ని ఏమంత అభివృద్ధి పరచలేదని, వచ్చిన నిధులను సద్వినియోగం చేయలేదనే విమర్శలను నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎదుర్కొంది.

టీడీపీ డివిజన్లలోనే అభివృద్ధి
తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్న డివిజన్‌లలో మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టి, మిగతా పార్టీల డివిజన్లలో అభివృద్ధిని గాలికి వదిలేశారు. పాలక మండలి బడ్జెట్‌లో  తెలుగుదేశం వారు తమకు అనుకూలంగా నిధులను మంజూరు చేయించుకున్నారు. ఫలితంగా మిగిలిన డివిజన్లలో అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. మరోపక్క తెలుగుదేశం కార్పొరేటర్ల ఏకపక్ష నిర్ణయాల వల్ల నగరంలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని ప్రజలు విమర్శిస్తున్నారు.

రేపటి నుంచి అధికారుల చేతికి పగ్గాలు 
మంగళవారంతో కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుండడంతో నగరపాలక సంస్థ పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఎన్నికల నిర్వహణకు స్పష్టమైన సంకేతాలు రావడంతో ఇప్పటికే అధికారులు నగరపాలక సంస్థలో డివిజన్ల వారీగా కులగణన చేసి జాబితాలు తయారు చేశారు. 50 డివిజన్‌లలో ఎస్సీ, బీసీ, మహిళల గణన కూడా పూర్తయ్యింది. డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ సిద్ధంగా ఉంది.

విలీనమైతే నగర విస్తీర్ణం పెరిగే అవకాశం
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో చుట్టు పక్కల గ్రామాల విలీనం జరిగితే ప్రస్తుతం ఉన్న 50 డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజక వర్గాలతో పాటు విలీనం తర్వాత రాజానగరం నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు కూడా నగరపాలక సంస్థలో అంతర్భాగం అవుతాయి. అదే జరిగితే నగర వైశాల్యం పెరగడంతో పాటు  ప్రస్తుతం ఉన్న 50 డివిజన్ల సంఖ్య 75కు పెరిగే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement