మ్యాప్‌ను పరిశీలిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్, అధికారులు
సాక్షి, కరీంనగర్ : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు హడావుడిగా జరిపిన డివిజన్ల పునర్విభజన రాజకీయ పార్టీల నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరగడంతో తదనుగుణంగా డివిజన్లను విభజించారు. కరీంనగర్ సిటీలో 2,50,484 మంది ఓటర్లు ఉండగా, 60 డివిజన్లకు విభజిస్తే ఒక్కో వార్డుకు 4,174 మంది ఓటర్లు ఉండాలి. డివిజన్ల భౌగోలిక స్వరూపం, రోడ్లు, కాలువలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కో డివిజన్‌కు 3,800 నుంచి 4,500 వరకు ఓటర్లను తీసుకొని విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
మునిసిపల్ అధికారులు తమకున్న తక్కువ సమయంలో ఇంటి నెంబర్లను ప్రాతిపదికగా తీసుకొని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా డివిజన్ల విభజన జరిపి ముసాయిదా డివిజన్ల జాబితాను ఈ నెల ఒకటో తేదీన ప్రకటించారు. ఇది గందరగోళంగా తయారైంది. ఇప్పటివరకు కొనసాగిన డివిజన్ల స్వరూపం చాలా చోట్ల మారిపోయింది. కొన్ని ఇంటి నెంబర్లు ఏ వార్డుల్లో కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో అధికార పార్టీ మాజీ కార్పొరేటర్లతోపాటు కొత్తగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌లను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పునర్విభజన సిత్రాలు మచ్చుకు కొన్ని...
ఇప్పటివరకు 20వ డివిజన్‌గా కొనసాగిన డివిజన్ ఇప్పుడు 17వ డివిజన్‌గా మారింది. ఇక్కడ కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహించిన కళావతి నివాసం ఉన్న గల్లీ మాత్రం 16వ డివిజన్‌లోకి చేరింది. 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సుజాత నివాసం 17వ డివిజన్‌లోకి వచ్చింది. హౌసింగ్‌బోర్డు కాలనీ ఇప్పటి వరకు 21వ డివిజన్‌గా ఉండగా, ప్రస్తుతం అది 18వ డివిజన్‌గా రూపాంతరం చెందింది. కానీ ఇందులోని 300కు పైగా నివాసాలు వేరే డివిజన్‌లోకి వెళ్లాయి. ఇక 41వ డివిజన్‌లోని ప్రాంతాలు కొన్ని 40, 42 డివిజన్లలోకి చేరాయి. 30వ డివిజన్ పరిస్థితి
కూడా అదే. 47, 40, 15 నెంబర్లు గల పాత డివిజన్లు ఇప్పుడు పూర్తిగా స్వరూపాన్ని కోల్పోయాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 40వ డివిజన్‌లో 2–10–185æ నెంబర్ నుంచి 2–10–310 వరకు గల ఇళ్లు ఏ వార్డులోనూ కనిపించడం లేదు. జ్యోతినగర్‌ను 45వ డివిజన్‌గా ప్రకటించిన అధికారులు కట్టరాంపూర్‌ను 46వ డివిజన్‌గా ప్రకటించారు. ఇక ఓటర్ల సంఖ్య విషయంలో కూడా ఎలాంటి శాస్త్రీయత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక డివిజన్‌లో 3000 పైచిలుకు ఓటర్లు ఉంటే మరో డివిజన్‌లో 4500 మంది ఓటర్లుగా ముసాయిదా జాబితాను ప్రకటించడం గమనార్హం.
సమయాభావం వల్లనే...
జూలై నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా డివిజన్ల విభజనలో శాస్త్రీయత లోపించింది. డివిజన్‌ల సంఖ్య 60కి అనుగుణంగా ఓటర్ల సంఖ్యను విభజిస్తూ హద్దులు నిర్ణయించడంతో డివిజన్లు ముక్కలు ముక్కలుగా తయారయ్యాయి. గతంలో డివిజన్ల పునర్విభజనకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకునే వారు. ఇంటి నెంబర్లతో సంబంధం లేకుండా ఒక వార్డు భౌగోళిక స్వరూపాన్ని ప్రామాణికంగా తీసుకొని తదనుగుణంగా ఇళ్లను చేర్చేవారు. రోడ్లు, రైల్వే లైన్లు, పార్కులు, కాలువలు, తదితర వాటిని హద్దులుగా నిర్ణయించి పునర్విభజన ప్రక్రియ సాగేది. ఈసారి శాస్త్రీయ విధానం లేకపోవడంతో ముసాయిదాలోనే గందరగోళం ఏర్పడింది.
నేటితో అభ్యంతరాలకు ముగుస్తున్న గడువు
ఈ నెల 1న ముసాయిదా డివిజన్ల జాబితాను అధికారులు ప్రకటించగా, శుక్రవారం వరకు అభ్యంతరాలు తెలియజేసేందుకు గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు, స్థానిక బస్తీ పెద్దలు, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కమిషనర్, కలెక్టర్‌లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. వార్డులను శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన జరపాలని కోరుతున్నారు. కాగా వచ్చిన అభ్యంతరాల మేరకు ఇప్పటికే మునిసిపల్ అధికారులు, సిబ్బంది వార్డుల్లో తిరుగుతూ వాస్తవాలను తెలుసుకుంటున్నారు. శుక్రవారం అభ్యంతరాలకు గడువు ముగిస్తే శనివారం ఒక్కరోజులేనే వాటిని సరిచేసి, ఆదివారం తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. హడావుడిలో ఎంత మేరకు న్యాయం జరుగుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment