డివిజన్ల పునర్విభజనకు ఆమోదం
Published Sat, Mar 4 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదించిన పునర్విభజనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 83 తేదీ 4–3–2017 ద్వారా పురపరిపాలన, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ప్రభుత్వం త్వరలో ఇక్కడ ఎన్నికలకు సమాయత్తమవుతున్నామన్న సంకేతాలను ఇచ్చినట్టయింది. ఆరేళ్ళుగా నగరపాలక సంస్థ ఎన్నికలు జరగకపోవడం, దీనిపై కాకినాడకు చెందిన మాజీ కౌన్సిలర్ చిట్నీడి మూర్తి హైకోర్టులో కేసు వేయడం తదితర పరిణామాలతో గత ఏడాది తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కాకినాడలో గతంలో ఉన్న 50 డివిజన్లను, కొన్ని పంచాయతీలను కలిపి హద్దులను మార్చి పునర్విభజన చేశారు. ఎస్.అచ్యుతాపురం, గంగానపల్లిలోని టీచర్స్‌కాలనీ, స్వామినగర్ ప్రాంతాలను విలీనం చేస్తూ మార్పులు, చేర్పులు చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా సేకరించారు. వచ్చిన 47 అభ్యంతరాలను పరిష్కరించి కౌన్సిల్ ఆమోదంతో తుది నివేదికను ప్రభుత్వానికి గత ఏడాది సెప్టెంబర్‌లో పంపించారు. ఈ ప్రతిపాదనలను యథావిధిగా ఆమోదిస్తూ పుర పరిపాలన శాఖ శనివారం జీవో ఎంఎస్ నెంబర్ 83 ద్వారా ఆమోదం తెలిపింది.
ఎన్నికల ఊసేదీ...?
పుర పరిపాలనశాఖ జారీ చేసిన జీవోలో స్పష్టత కొరవడిందని రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. గత నెల చివరిలో శ్రీకాకుళం, కర్నూలు, తిరుపతి, అనంతపురం కార్పొరేష¯ŒS ఎన్నికలకు సంబంధించి పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని చెబుతున్నారు. కాకినాడ విషయంలో మాత్రం కేవలం పునర్విభజనకు ఆమోదం తెలిపారే తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తదితర అంశాలపై ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టత లేదంటున్నారు. కేవలం కంటితుడుపుగా ఆమోదం తెలిపారే తప్ప మిగిలిన కార్పొరేషన్లతోపాటుగా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయనే అంశంపై స్పష్టత లేకపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలుత జీవో నెంబర్ లేకుండానే పునర్విభజనకు ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు రావడం, ఆ తరువాత జీవో నెంబర్‌తో ఇచ్చినా అది డౌన్‌లోడు కాకపోవడంతో మరికొంత గందరగోళానికి దారితీసింది. జీవో నెంబర్‌తో సహా ఉత్తర్వులు కాపీ చేతికందితే తప్ప దీనిపై ఏమి చెప్పలేమంటూ కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి. కోర్టు నుంచి మొట్టికాయలు పడడంతో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నట్టుగా చూపించేందుకే ఇలా పునర్విభజనను ఆమోదించారా? లేక ఇతర కార్పొరేషన్లతోపాటుగా ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తారా? అనే అంశంపై ఒకటి,రెండు రోజుల్లో స్పష్టతవచ్చే అవకాశం ఉంటుందన్నారు.
Advertisement
Advertisement