రాష్ట్రవ్యాప్తంగా ‘వాష్’
- స్వచ్ఛభారత్‌లో భాగంగా అమలు
- నీరు, పారిశుధ్యానికి ప్రాధాన్యత
- 150 మండలాల్లో 13 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం
- పైలట్ ప్రాజెక్టు కింద 12 గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచిక మెరుగుదల నిమిత్తం గ్రామీణ ప్రాం తాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛభారత్ అమల్లో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 150 మండలాల్లో ‘వాష్’ (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) కార్యక్రమాన్ని ప్రారంభించాలని సర్కారు సంకల్పించింది. దీన్ని ఈ నెల రెండో వారంలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘వాష్’ ద్వారా వ్యక్తిగత పరిశుభ్రతపట్ల విస్తృత అవగాహన, మరుగుదొడ్ల నిర్మాణాన్ని పెద్దఎత్తున చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పైలట్ ప్రాజెక్టు కింద 9 జిల్లాల నుంచి 12 గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించనుంది. ఫలితాలను సమీక్షించిన తర్వాత మిగిలిన గ్రామాలకూ విస్తరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు నిర్ణయించారు. ‘వాష్’ అమలు నిమిత్తం మొదటి విడతగా రూ.47.56 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో కేంద్రం వాటా రూ. 33.3 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14.26 కోట్లు విడుదల చేసింది.
‘వాష్’ అమలు ఇలా..
ఎంపిక చేసిన గ్రామంలో ‘వాష్’ అమలు బాధ్యతలను గ్రామ సమాఖ్యలు చేపడతాయి. మార్పు కమిటీలను ఏర్పాటు చేసి, వాటిని బలోపేతం చేసేలా చర్యలు చేపడతారు.
ప్రధానంగా ఆరుబయట మల విసర్జనను రూపుమాపేందుకు ప్రజ లను చైతన్యం చేస్తారు.
ఎంపిక చేసిన వలంటీర్లు నీరు, పరిశుభ్రత, పారిశుధ్యం అంశాలకు సంబంధించి గ్రామంలో కుటుంబాల వారీగా బేస్‌లైన్ సర్వే నిర్వహిస్తారు. వలంటీర్లకు ఇందిరా క్రాంతి పథం సిబ్బంది సహకరిస్తారు.
సర్వేలో వెల్లడైన వివరాలను గ్రామసభలో చర్చించి నిర్ణీత సమయంలోగా ప్రతి కుటుం బం మరుగుదొడ్డి నిర్మించుకునేలా తీర్మానం చేస్తారు. ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణం, నిఘా పేరుతో 3 ఉపకమిటీలను నియమిస్తారు. కమిటీల్లో గ్రామ సమాఖ్య సభ్యులు, సర్పం చ్, వార్డు సభ్యులు ఉంటారు. వాష్ కమిటీలకు సర్పంచులే అధిపతులుగా వ్యవహరిస్తారు.
ప్రతీ మరుగుదొడ్డి నిర్మాణానికి ముందస్తుగా రూ.1,200 ఇస్తారు. విరాళాలనూ సేకరించవచ్చు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో పనిచేసే గ్రామ సమాఖ్యలకు రూ.50 లక్షలు రివాల్వింగ్ ఫండ్‌ను గ్రామీణ నీటి పారుదల, పారిశుధ్య (ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్) విభాగం అందజేస్తుంది. ఈ నిధులను గ్రామ సమాఖ్యలు మరుగుదొడ్ల నిర్మాణానికి అడ్వాన్స్‌గా వినియోగించుకోవచ్చు.