హోంగార్డులకు తీపి కబురు
- జీతం రూ. 12 వేలకు పెంచుతూ సర్కారు నిర్ణయం
- ఇకపై పీఎఫ్ సౌకర్యం, రూ. 2 లక్షల ఆరోగ్య బీమా
- పరేడ్ అలవెన్స్ రూ.100, వచ్చే ఏప్రిల్ నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: హోంగార్డుల మొరను తెలంగాణ ప్రభుత్వం ఆలకించింది. ఎట్టకేలకు వారికి తీపికబురు వినిపించింది. హోంగార్డులకు సాంత్వన చేకూర్చేలా సర్కారు పలు నిర్ణయాలు తీసుకుంది. నెల జీతాన్ని రూ. 9 వేల నుంచి రూ. 12 వేలకు పెంచడంతోపాటు పీఎఫ్ సౌకర్యం కూడా కల్పించింది. ఇకపై హోంగార్డులు నెలకు 1,400 చొప్పున భవిష్యనిధికి చెల్లిస్తే, ప్రభుత్వం అంతే మొత్తాన్ని జమ చేయనుంది. దీంతో పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందనుంది. రూ.2 లక్షల ఆరోగ్య బీమాను కూడా వర్తింపజేయనుంది. పరేడ్ అలవెన్సును రూ.28 నుంచి రూ.100 పెంచింది.
జంటనగరాల్లో రాయితీతో కూడిన బస్‌పాస్ సౌకర్యం కూడా లభించనుంది. ఇందుకోసం హోంగార్డులు నెలకు రూ. 270 చొప్పున చెల్లిస్తే, మిగతా మొత్తాన్ని ప్రభుత్వం కడుతుంది. ఇకనుంచి ఏడాదికి రెండు జతల బట్టలను కూడా సమకూర్చనుంది. శనివారం హోంగార్డుల స్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే ఏప్రిల్ నుంచి ఇవి అమలులోకి వస్తాయని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. దీంతో రాష్ర్టంలోని మొత్తం 19,500 మంది హోంగార్డులకు లబ్ధి చేకూరనుంది. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపీరెడ్డి, హోంగార్డుల సంఘం అధ్యక్షుడు రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.