
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 20 మంది మృతిచెందారు. అధికారులు మాత్రం 12 మందే మరణించినట్లు చెబుతున్నారు. ఒక్క ఉస్మానియా ఆసుపత్రిలోనే స్వైన్‌ఫ్లూతో 10 మంది మరణించినట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. చలికాలం ప్రారంభం కావడంతో స్వైన్‌ఫ్లూ మరింత విజృంభిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది.
ఎన్నికల సమయం కావడంతో కిందిస్థాయి వైద్య సిబ్బందిని కూడా ఉపయోగించుకోవడంతో గ్రామాలు మొదలు కార్పొరేషన్ల వరకు అంతా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ తొలిసారి అన్ని జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. స్వైన్ ఫ్లూ నియంత్రణను పర్యవేక్షించేందుకు నలుగురు అధికారులతో కూడిన ప్రత్యేక నోడల్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
37 ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు..
హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, కోరంటి ఫీవర్ ఆసుపత్రులతో పాటు 30 జిల్లాల్లోని 37 ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డులను అందుబాటులో ఉంచారు. ఈ ఆసుపత్రుల్లో మొత్తం 467 పడకలను సిద్ధం చేశారు. వైరస్ నిర్ధారణ పరీక్షలను నారాయణగూడ ఐపీఎంతో పాటు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమూనాలు సేకరించేందుకు అవసరమైన కిట్స్‌ను అందుబాటులో ఉంచారు. స్వైన్ ఫ్లూ సోకిన వారి కోసం లక్ష డోసుల వసల్టావీర్ టాబ్లెట్లు, సిరప్ సిద్ధంగా ఉంచామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.
చలికాలంలో హెచ్1 ఎన్1 వైరస్ వ్యాపించకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు వైద్యులు, నర్సులు తదితర పారామెడికల్ సిబ్బందికి అవసరమైన మాస్కులు, టీకాలు, ఇతర ఔషధాలు సిద్ధం చేశామని చెప్పారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన రోగులకు తక్షణం పరీక్షలు నిర్వహించి, తదుపరి చికిత్సకు గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment