
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో నిర్మితమైన ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే దశలో ఉందని, దీని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన హెల్త్‌కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ మహేష్‌కుమార్ దీన్ని దాఖలు చేశారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక సౌకర్యాలతో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందులో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.
ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. ఆసుపత్రి భవనం వైద్యులు, నర్సులు, సిబ్బంది, రోగులకు ప్రమాదకరంగా మారిందని పిటిషనర్ తెలిపారు. ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడుతున్నాయని, గతంలో కూడా పలువురు గాయపడ్డారని వివరించారు. 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రస్తుత అవసరాలకు అనుగుణం లేదన్నారు. గతంలో కూడా పలు ప్రభుత్వాలు ఈ ఆసుపత్రి స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పాయని ప్రస్తావించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసుపత్రిని సందర్శించి, కొత్త భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని వివరించారు.