తెలంగాణలో ఐఐఎంను ప్రారంభించండి
♦ కేంద్ర మంత్రిని కోరిన మంత్రులు కడియం, కేటీఆర్
♦ చట్ట ప్రకారం అన్ని సంస్థలు ఏర్పాటు చేస్తాం: జవదేకర్
న్యూఢిల్లీ : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మంత్రులు కడియం శ్రీహరి, కె. తారకరామారావు కోరారు. సోమవారం కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలుసుకున్న రాష్ట్ర మంత్రులు, ఎంపీ వినోద్‌కుమార్.. హైదరాబాద్ కేంద్రంగా ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాల్లో నవోదయ, 14 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, వరంగల్ కేంద్రంగా ప్రాంతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని విన్నవించారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 525 గురుకుల పాఠశాలల కోసం ఏటా రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తోందని, ఈ విషయంలో కేంద్రం కూడా సహకరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల చేరిక సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్యనందించాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి చట్ట ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన అన్ని విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు కడియం శ్రీహరి తెలిపారు. కేంద్ర మంత్రితో సమాశమవ్వడానికి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీ వచ్చిన మంత్రి కడియం విమానాశ్రయం నుంచి మెట్రో రైలులో శివాజీ స్టేడియం స్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్లారు.