నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి
► కొత్త జిల్లాల కోసం ప్రకాశ్ జవదేకర్‌ను కోరిన కడియం
► కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యనందించండి
► సర్వశిక్ష అభియాన్ నిధులు విడుదల చేయండి
► జిల్లాకు ఒకటి చొప్పున డైట్‌లు మంజూరు చేయాలని విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఉప ముఖ్య మంత్రి మంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మరిన్ని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలను ఏర్పాటు చేయాలని, వాటిల్లో 12వ తరగతి వరకు విద్యను అందించాలని కోరారు. మంగళవారం టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, సీతారాం నాయక్, జి.నగేశ్, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌లతో కలసి కడియం శ్రీహరి ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వశిక్షా అభియాన్ నుంచి రాష్ట్రానికి రావా ల్సిన నిధులు, కస్తూర్బా పాఠశాలల ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రంలో మండ లాల సంఖ్య కూడా పెరగడంతో విద్యాప రంగా వెనుకబడిన 110 మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయాలని జవదేకర్‌ను కోరారు. అనంతరం ఎంపీలతో కలసి కడియం మీడియాతో మాట్లాడారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కస్తూర్బా గాంధీ పాఠశాలలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. కస్తూర్బా పాఠశాలల్లో 8వ తరగతి వరకే కేంద్ర ప్రభుత్వం ఖర్చు భరిస్తోందని.. 9, 10వ తరగతుల విద్యార్థుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ఈ పాఠశాలలు మంచి ఫలితాలను సాధిస్తుండడంతో కేంద్ర సాయాన్ని 12వ తరగతి వరకు అందించాలని కోరామన్నారు. బాలికల విద్యకు ఇది దోహదపడుతుందని, బేటీ బచావో బేటీ పఢావోకు తోడ్పడుతుందని వివరించామని కడియం తెలిపారు. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున టీచర్ ట్రైనింగ్ కేంద్రా (డైట్)లను మంజూరు చేయాలని కోరామన్నారు.
అధికారులతో భేటీ...
అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శితో కడియం, రాష్ట్ర విద్యాశాఖ ఉన్న తాధికారులు భేటీ అయ్యారు. మాధ్యమిక శిక్షా అభియాన్, సర్వశిక్షా అభియాన్‌ల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. దీనిపై స్పందించిన మానవవనరులశాఖ కార్యదర్శి తెలంగాణకు రూ.500 కోట్లు విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలి చ్చారని కడియం తెలిపారు.
నిధులు విడుదల చేయండి..
సర్వశిక్షా అభియన్ కింద 2016-17కుగాను కేంద్రం ఇప్పటి వరకు కేవలం రూ. 217 కోట్లే విడుదల చేసిందని చెప్పారు. కానీ టీచర్ల జీతాల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.915 కోట్లు చెల్లించాల్సి ఉందని.. కేంద్రం నిధుల విడుదలలో చేస్తున్న జాప్యం వల్ల టీచర్లకు జీతాలు అందని పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేశామని తెలిపారు. ఆయా అంశాలన్నింటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కడియం వెల్లడించారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామని, సర్వశిక్షా అభియన్ నిధుల విడుదలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దేశంలో 20 విద్యాలయాలకు ప్రపంచ స్థాయి విద్యాలయాల గుర్తింపు ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదించిన నేపథ్యంలో... హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.