
టీజేఏసీ కొనసాగుతుంది
తెలంగాణ రాజకీయ జేఏసీ భవిష్యత్ డోలాయమానంలో పడిందా?
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ భవిష్యత్ డోలాయమానంలో పడిందా? ఒక్కో పార్టీ, సంఘం పక్కకు తప్పుకుంటుం డంతో జేఏసీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందా? తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ తాము టీజేఏసీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చేసిన ప్రకటనతో తెలంగాణ వాదుల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీజేఏసీ ముక్కలు చెక్కలు అయినట్లేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీజేఏసీ తన కర్తవ్యాన్ని కొనసాగిస్తుంది. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎప్పటిలాగే కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ క్రమంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు తన వంతు కృషిని కొనసాగిస్తుంది..’’ అని పేర్కొంటూ బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొంత అయోమయంలో ఉన్న జేఏసీ వర్గాల్లో స్పష్టత వచ్చిందని, ఇక ముందు మరింత స్వేచ్ఛగా ప్రజల పక్షాన పోరాడటానికి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని జేఏసీ ముఖ్యుల్లో ఒకరు తెలిపారు.
అసలేం జరుగుతోంది?
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వివిధ సంఘాల్లో పనిచే స్తూ జేఏసీలో భాగస్వాములుగా ఉన్న పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కున్నారు. దీంతో జేఏసీ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. రాజకీయ పార్టీల విషయాన్ని పక్కన బెడితే ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలకు చెందిన వారూ జేఏసీకి దూరమవుతూ వచ్చారు. టీఆర్‌ఎస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఏడాదిన్నర పాటు ప్రభుత్వం పట్ల జేఏసీ సానుకూలంగానే ఉంది. కొత్త ప్రభుత్వానికి కొంత గడువివ్వాలని, ఇంకా సంపూర్ణ తెలంగాణ సిద్ధించలేదని, రాష్ట్ర హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై పోరాడాల్సి ఉందని ప్రకటించింది.
అయితే ఉద్యమ సమయంలోని జేఏసీకి, ప్రస్తుత జేఏసీకి చాలా తేడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే గడిచిన రెండు నెలలుగా జేఏసీ చైర్మన్ కోదండరాం అడపాదడపా ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ వచ్చారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తీరును ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదన్నారు. ఒకవిధంగా ఇటీవల తరచుగా ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో జేఏసీలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీజీవో, టీఎన్‌జీవో వంటి ఉద్యోగ సంఘాలకు ఇబ్బందిగా మారిందన్న చర్చ జరిగింది. ఈ కారణంగానే ఈ రెండు సంఘాలతోపాటు మరికొన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై టీ జేఏసీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జేఏసీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంటున్నారు. టీజీవోకు గౌరవాధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యే అయ్యారు. టీఎన్‌జీవో గౌరవాధ్యక్షుడిగా ఉన్న దేవీప్రసాద్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి ప్రతికూలంగా వ్యవహరించే జేఏసీలో కొనసాగడం వారికీ ఇబ్బందిగా మారిందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగ సమస్యలపై, చేపట్టాల్సిన పోరాటాలపై దృష్టిపెట్టాల్సి ఉన్నందున టీజేఏసీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఉద్యోగ సంఘాల జేఏసీ.. టీజేఏసీ నుంచి పక్కకు తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో, తెలంగాణ వాదుల్లో చర్చనీయాంశం అయ్యింది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జేఏసీ ఎందుకు?
ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నందున, తెలంగాణ జేఏసీ (పొలిటికల్) కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించాం. ఇక నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుగా సాగాలని భావిస్తున్నాం. పైగా తెలంగాణ ఏర్పడిన తర్వాత టీజేఏసీ కొనసాగింపు అవసరం లేదని భాగస్వామ్య సంఘాలు గత సమావేశాల్లో ప్రతిపాదించాయి. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగుల సమస్యలు, పీఆర్‌సీ బకాయిలు చెల్లింపు, హెల్త్‌కార్డుల అమలు వంటి అంశాలను త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టాలని కోరుతాం. దశల వారీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుంటాం. ఉద్యోగుల విభజన, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు, కేంద్రం అనుసరిస్తున్న ఉద్యోగ, వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నందున రాజకీయ జేఏసీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించాం.
- రవీందర్‌రెడ్డి, హమీద్, టీఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు
- మమత, సత్యనారాయణ, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు