'రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కేసీఆర్'
హైదరాబాద్: తమ పార్టీలోకి రావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రోత్సహిస్తూ... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్ను అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓ వైపు సీఎంగా మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ కొనసాగుతూ... ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి తీసుకోవడం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమని జీవన్రెడ్డి గుర్తు చేశారు.
సీఎం పదవిని రాజ్యాంగ స్పూర్తితో నిర్వహిస్తానని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇటువంటి చర్యల ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ను అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జీవన్రెడ్డి తెలిపారు. సీఎంగా ఉండి ఫిరాయింపులను ప్రోత్సహించింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని జీవన్రెడ్డి వెల్లడించారు.