T.jeevan reddy
-
ఎస్ఐల ఆత్మహత్యలపై సీబీఐ విచారణ
జరపాలని జీవన్‌రెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కుకునూర్‌పల్లి ఎస్సైలుగా పనిచేస్తూ ఆత్మహత్యలకు పాల్పడటానికి కారణాలు ఏమిటో,కారకులు ఎవరో తేల్చడానికి సీబీఐ విచారణ జరపాలని సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎస్ఐలు ప్రభాకర్‌రెడ్డి , రామకృష్ణారెడ్డి మృతిపై న్యాయ విచారణ జరిపించడం ద్వారా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు పోలీసులను గుప్పె ట్లో పెట్టుకోవడం, అనేక అంశాల్లో వారిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య తర్వాత శాంతియుతంగా ధర్నా చేసినవారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగు తున్నదన్నారు. మియాపూర్ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిగితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించకపోతే టీఆర్ఎస్తో బీజేపీ చేతులు కలిపినట్టేనని అన్నారు. -
రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం
సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం, రైతులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు విక్రయించిన ధాన్యానికి ఇంకా పూర్తి డబ్బులు చెల్లించలేదని, ఖాతాల్లో కొందరికి డబ్బులు వేసినా బ్యాంకులు ఇవ్వడం లేదన్నారు. సబ్సిడీపై నాణ్య మైన విత్తనాలను ప్రభుత్వం అందించలేకపోయిందని ఆరోపించారు. మిర్చి, కందులు కొనడంలో ప్రభుత్వం విఫలమైందని, గిట్టుబాటు ధరలను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ రైతులను పట్టించుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'పేరు మార్చి హడావుడి చేస్తున్నారు'
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులు కరువు కోరల్లో చిక్కుకుని కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... కరువు మండలాల ప్రకటనలో ఆలస్యం జరిగిందని ఆరోపించారు. ఒకేసారి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో కొత్తదనం ఏమీ లేదని విమర్శించారు. పేరు మార్చి హడావుడి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీని జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. -
'ప్రాజెక్టుల రీడిజైన్‌కు స్వస్తి పలకాలి'
కరీంనగర్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్.. తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై కరీంనగర్లో ఆదివారం రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును యథావిధిగా చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌కు ప్రభుత్వం స్వస్తి పలకాలని సూచించారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్దేశించిన ప్రదేశంలోనే నిర్మించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
'చీప్ లిక్కర్ తాగినా హాని ఉండదా..!
రాయికల్ (కరీంనగర్ జిల్లా): రాష్ట్రంలో చీప్‌లిక్కర్ ను ప్రోత్సహించడంపై సీఎల్పీ ఉపనేత తాటిపత్రి జీవన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని అన్ని పార్టీలు, ప్రజలు డిమాండ్ చేస్తుంటే తెలంగాణలో చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టేందుకు కేసీఆర్ నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. 'మద్యం బాటిళ్లపై మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిక ఉంటుంది. దీన్ని గ్రహించని కేసీఆర్ మాత్రం చీప్‌లిక్కర్ తాగితే ప్రాణానికి ఎలాంటి హాని ఉండదని చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. గుడుంబాను నియంత్రించాలంటే చీప్‌లిక్కర్‌ను తాగాలని చెప్పడం సరికాదు. గీతకార్మికుల పొట్టకొట్టడం కోసమే సీఎం పన్నాగం చేస్తున్నారు. ఎక్సైజ్, పోలీసు శాఖల సహకారంతో గుడుంబాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చీప్‌లిక్కర్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మహిళా సంఘాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం' అని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి హెచ్చరించారు. -
'కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి'
సంగెం: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు వరంగల్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఎల్పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా సంగెం మండలం మెండ్రాయిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని, దళితుణ్ని సీఎం చేస్తానని, రైతులకు రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇల్లు, మున్సిపాలిటీల్లో జీ ప్లస్ వన్ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి విస్మరించినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏ ముఖం పెట్టుకొని ఉప ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య చేసిన పాపం ఏమిటి?.. శ్రీహరి చేసిన పుణ్యం ఏమిటో స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెసు పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒకేసారి రూ. 60 వేల కోట్ల రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. అర్హులందరికీ ఇల్లు, పింఛన్లు మంజూరు చేసినట్లు జీవన్ రెడ్డి గుర్తు చేశారు. -
'వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందా ?'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు మధ్య క్విడ్ ప్రోకో ఏంటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదని టీ సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఇద్దరి సీఎంల మధ్య ఒప్పందం ఏమైనా కుదిరిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం కూడా ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ నేరమే.. ఓటుకు కోట్లు నేరమే.. అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో అవినీతికి పాల్పడిన.. ఎంతటి వారికైనా శిక్ష పడాల్సిందేనని ఆయన అన్నారు. ఈ వ్యవహారం కేవలం తెలంగాణకు మాత్రమే సంబంధించింది కాదని.. రెండు రాష్ట్రాలకు చెందిందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇన్ని రోజులైనా ఈ కేసు ఎందుకు నీరుగారుతోందో అర్థం కావడం లేదన్నారు. టీఆర్ఎస్, టీడీపీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఎదురుదాడి చేసుకుంటున్నాయని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
'రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కేసీఆర్'
హైదరాబాద్: తమ పార్టీలోకి రావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రోత్సహిస్తూ... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓ వైపు సీఎంగా మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ కొనసాగుతూ... ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి తీసుకోవడం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. సీఎం పదవిని రాజ్యాంగ స్పూర్తితో నిర్వహిస్తానని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇటువంటి చర్యల ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జీవన్‌రెడ్డి తెలిపారు. సీఎంగా ఉండి ఫిరాయింపులను ప్రోత్సహించింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని జీవన్‌రెడ్డి వెల్లడించారు. -
రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం
హైదరాబాద్: రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలోని రైతాంగ సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు దృష్టి పెట్టాలని కేసీఆర్‌కు ఆ లేఖలో హితవు పలికారు. ధాన్యం క్వింటాలుకు రూ. 100 చొప్పున చెల్లించాలని... అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ అంశంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అందులోభాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. -
ఇదేం రుణమాఫీ?: సీఎల్పీ
75 శాతం అప్పును రైతులపై రుద్దే కుట్ర సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రుణమాఫీ మొత్తంలో నాలుగోవంతు నిధులను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడం వెనుక పెద్దకుట్ర దాగిఉందని కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆరోపించింది. మిగిలిన 75 శాతం రుణాలను రైతులపై భారం మోపడమే ప్రభుత్వలక్ష్యంగా కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, పి.కిష్టారెడ్డి, వంశీచంద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటినుంచీ పిల్లిమొగ్గలు వేస్తోందని, రూ. 19 వేల కోట్ల రుణాలను 17 వేల కోట్ల రూపాయలకు కుదించడమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మిగిలిన మొత్తానికి ప్రభుత్వమే బ్యాంకులకు పూచీకత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
అలా అనుకుంటే కేసీఆర్ పొరపాటే: జీవన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ హైకమాండ్‌కు సన్నిహితులైన ఎమ్మెల్సీలే టీఆర్ఎస్లో చేరడం బాధాకరమని జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నేతను చూపడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమమైందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ లోపముందని, పార్టీని బలోపేతంచేసే సమర్ధ నాయకత్వం అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. ఫిరాయింపులతో టీఆర్ఎస్ బలపడుతుందంటే... అది కేసీఆర్ పొరపాటే జీవన్‌రెడ్డి అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడంక కంటే ఎన్నికల హామీలపై చిత్తశుద్ధి చూపాలని కేసీఆర్ కు జీవన్ రెడ్డి సూచించారు. రుణమాఫీ అమలు ఆలస్యమవుతున్నందున తక్షణమే ఖరీఫ్ రుణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించాలని జీవన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సీఎల్పీ లీడర్.. టీపీసీసీ చీఫ్!
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డికి పార్టీలో ప్రధానమైన పదవి లభిస్తుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ గాలిలో జిల్లాలోని సిట్టింగ్ స్థానాలన్నీ ‘చే’జారిపోగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. తన నాయకత్వ పటిమతో కారు జోరును తట్టుకుని నిలిచిన ఆయన జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌కు ధీటైన వాగ్ధాటి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడు జీవన్‌రెడ్డి అని, ఆయనకు సీఎల్పీ బాధ్యతలు అప్పగిస్తే భవిష్యత్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ నాయకుల్లో గతంలో అసెంబ్లీలో గట్టిగా గళమెత్తింది జీవన్‌రెడ్డి అనే టాక్ ఉండటం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్.రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి హయాంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల ప్రసంగాలకు జీవన్‌రెడ్డి ధీటుగా సమాధానం ఇచ్చారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి అసెంబ్లీ టైగర్‌గా పేరు తెచ్చుకున్న విషయాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నువ్వా.. నేనా అనే రీతిలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి పోరాడిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం తెలంగాణలో గెలుపొందిన కాంగ్రెస్ నేతల్లో ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ప్రథముడు కె.జానారెడ్డి కాగా, ఆరుసార్లు అసెంబ్లీకి వెళ్లిన వారిలో జీవన్‌రెడ్డి ఒక్కరే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులను సమర్థంగా నిర్వహించిన అనుభవం సైతంకు ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానవర్గం జీవన్‌రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందండం, సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన సారథ్యంపై సొంత పార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ చైర్మన్ సీటు నుంచి పొన్నాలను దించడం ఖాయమనే వాదనలు వినిస్తున్నాయి. దీంతో జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా.. లేదా పార్టీ సారథిగా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ రెండింటిలో ఏదో ఒక పదవి కచ్చితంగా దక్కుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రెండు రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్న జీవన్‌రెడ్డిని పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పదవుల విషయం చర్చకు వస్తోంది. జీవన్‌రెడ్డి మాత్రం తనకు పదవి వచ్చినా.. రాకున్నా ప్రజల తరఫున పోరాడుతూ పార్టీ పటిష్టం కావడానికి కృషి చేస్తానని తనను కలిసిన వారితో చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో జీవన్‌రెడ్డి సమావేశం కానున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో తీసుకునే కీలక నిర్ణయాలు అధిష్టానానికి నివేదించనున్నట్టు సమాచారం.