'వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందా ?'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు మధ్య క్విడ్ ప్రోకో ఏంటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదని టీ సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఇద్దరి సీఎంల మధ్య ఒప్పందం ఏమైనా కుదిరిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం కూడా ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ నేరమే.. ఓటుకు కోట్లు నేరమే.. అన్నారు.
ఓటుకు కోట్లు వ్యవహారంలో అవినీతికి పాల్పడిన.. ఎంతటి వారికైనా శిక్ష పడాల్సిందేనని ఆయన అన్నారు. ఈ వ్యవహారం కేవలం తెలంగాణకు మాత్రమే సంబంధించింది కాదని.. రెండు రాష్ట్రాలకు చెందిందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇన్ని రోజులైనా ఈ కేసు ఎందుకు నీరుగారుతోందో అర్థం కావడం లేదన్నారు. టీఆర్ఎస్, టీడీపీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఎదురుదాడి చేసుకుంటున్నాయని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.