ఆ 20 మంది ఎవరు?
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో 'దేశం' నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి వారెంట్లు పొందినట్లు సమాచారం రావడంతో ఆ పార్టీ నాయకులు వణుకుతున్నారు.
ఈ వ్యవహారంలో పాత్రధారులుగా భావిస్తున్న మరో 20 మంది దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించింది. దీనికి సంబంధించి బుధవారం అధికారికంగా నోటీసులు జారీ చేయనుంది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద వీరందరినీ దశలవారీగా విచారణకు రావాలని నోటీసులు జారీ చేయనుంది. వీరిలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావు, శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఒక మాజీ ఎంపీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర దేశం నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
దీంతో ఏసీబీ ఎప్పుడు ఎవరికి నోటీసులు జారీ చేస్తుందోనని టీడీపీ నేతలు కలవరపడుతున్నారు. ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలోనైనా 'బాస్'కు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశముందని సమాచారం.