ఎస్‌ఐల ఆత్మహత్యలపై సీబీఐ విచారణ
జరపాలని జీవన్‌రెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కుకునూర్‌పల్లి ఎస్సైలుగా పనిచేస్తూ ఆత్మహత్యలకు పాల్పడటానికి కారణాలు ఏమిటో,కారకులు ఎవరో తేల్చడానికి సీబీఐ విచారణ జరపాలని సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి , రామకృష్ణారెడ్డి మృతిపై న్యాయ విచారణ జరిపించడం ద్వారా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
అధికార పార్టీ నాయకులు పోలీసులను గుప్పె ట్లో పెట్టుకోవడం, అనేక అంశాల్లో వారిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య తర్వాత శాంతియుతంగా ధర్నా చేసినవారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగు తున్నదన్నారు. మియాపూర్ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిగితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించకపోతే టీఆర్‌ఎస్‌తో బీజేపీ చేతులు కలిపినట్టేనని అన్నారు.