ఇదేం రుణమాఫీ?: సీఎల్పీ
75 శాతం అప్పును రైతులపై రుద్దే కుట్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రుణమాఫీ మొత్తంలో నాలుగోవంతు నిధులను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడం వెనుక పెద్దకుట్ర దాగిఉందని కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆరోపించింది. మిగిలిన 75 శాతం రుణాలను రైతులపై భారం మోపడమే ప్రభుత్వలక్ష్యంగా కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, పి.కిష్టారెడ్డి, వంశీచంద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటినుంచీ పిల్లిమొగ్గలు వేస్తోందని, రూ. 19 వేల కోట్ల రుణాలను 17 వేల కోట్ల రూపాయలకు కుదించడమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మిగిలిన మొత్తానికి ప్రభుత్వమే బ్యాంకులకు పూచీకత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు.